Farmer suicide: సంగారెడ్డి జిల్లా(sanga reddy dist) జహీరాబాద్ మండలం అనెగుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక సొంత పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ రైతు. గ్రామానికి చెందిన ఆగమయ్య(58)కు.. నాలుగెకరాల పొలం ఉంది. ఆయనకు ముగ్గురు పిల్లలు. ఖరీఫ్‌లో పొలాన్ని సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు(crop loss). పెట్టుబడైనా వస్తే బాగుండేది అని ఆశపడ్డాడు. కానీ అది అడియాస గానే మిగిలింది. అకాల వర్షాలు, పంట తెగుళ్లు ఆగమయ్యను ఇబ్బందులకు గురిచేశాయి. పంట చేతికొచ్చే సమయంలో అనుకోని వర్షాలు నిండా ముంచెత్తాయి. పంట పెట్టుబడికి చేసిన అప్పులన్నీ అలాగే మిగిలాయి. దీనికి తోడు ఇద్దరు కుమార్తెలు, కుమారుడి పెళ్లిళ్లకు చేసిన అప్పులు కూడా వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయి.
పదిహేను రోజులుగా
ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలని ఆలోచిస్తూ.. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు ఆ రైతు. ప్రతి క్షణం ఆందోళనగానే ఉంటున్నాడు. గత పదిహేను రోజులుగా ఆలోచనలు మరీ ఎక్కువై పోయి.. ఇంటి సభ్యుల ముందు గోడును వెళ్లబోసుకున్నాడు. ఆర్థిక కష్టాలు ఎలా గట్టెక్కుతాయని వాళ్లతో చర్చించాడు. కోటి ఆశలతో పొలాన్ని సాగు చేసినా.. తమ బతుకులు మారడం లేదని కలత చెందాడు. ఇన్ని ఆలోచనలతో బతకలేనని అనుకున్నాడో ఏమో.. అప్పుల వాళ్లకు ఎలా ముఖం చూపించాలని బాధపడ్డాడో ఏమో.. కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం ఉదయం బయటకు వెళ్తున్నాని చెప్పి ఆగమయ్య.. ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. నేరుగా పొలానికి వెళ్లాడు. ఇన్ని రోజులు కలియదిరిగిన తన భూమిని తనివి తీరా చూసుకుంటూ.. ఆ నేలలోనే కలిసి పోవాలనుకున్నాడు. తన పొలంలోనే ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.