Cyber crimes today: 'హాయ్ ఎలా ఉన్నావు.. ఏం చేస్తున్నావు.. రూ.5000 నా ఫ్రెండ్ నెంబర్‌కు గూగుల్ పే గానీ, ఫోన్‌పే కానీ చేయవా.. తనకు అత్యవసరం ఉంది.. అంటూ మిత్రుల ఫొటోలతో వాట్సాప్‌లో ఛాటింగ్ చేస్తూ నగదు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మొన్నటి వరకు బ్యాంకు అధికారులమని మాట్లాడి ఓటీపీ (వన్‌టైమ్ పాస్‌వర్డ్)తో నగదు కాజేసిన దుండుగులు ఇప్పుడు ఈ తరహా మోసాలకు తెరతీశారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో శనివారం రాత్రి గంటల వ్యవధిలోనే 5 మంది నుంచి సుమారు రూ.30 వేల వరకు కాజేయడం గమనార్హం.
Cyber cheaters whats app chatting: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు అతడి చిత్రాన్ని వాట్సాప్ నెంబరుకు పెట్టి తూప్రాన్, వర్గల్ మండలాల్లో ఉన్న అతడి మిత్రులకు నగదు కోసం వల వేశాడు. అమెరికాలో ఉన్న సదరు యువకుడి మాదిరిగానే హాయ్ అని సందేశం పంపించారు. నా సోదరుడికి అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది.. ఒక 5కే (రూ.5000) పంపించు అంటూ ఓ ఫోన్ నెంబరుపై సందేశంలో పంపించాడు. నిజంగానే తన మిత్రుడే అనుకొని పలువురు రూ.4, రూ.5 వేల చొప్పున సైబర్ నేరగాడు ఇచ్చిన ఫోన్‌నెంబరుకు ఆన్‌లైన్ ద్వారా పంపించారు. డబ్బు బదిలీ అయిందా తెలుసుకుందామని ఫోన్ చేసేసరికి.. సైబర్ నేరగాడు నెంబరును స్విచ్చాఫ్ చేశాడు.