Bike e- challan : ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో మనకు తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘిస్తే.. చలాన్లు వేయడం ట్రాఫిక్ పోలీసుల విధుల్లో భాగం. ఇక కొవిడ్ వ్యాపించిన తర్వాత.. మాస్కు లేకపోతే రూ. 1000 జరిమానా అదనం. ట్రాఫిక్ నిబంధనలు పాటించని కొందరు.. ఈ చలాన్లు పడగానే తమ బాధ్యతగా జరిమానా కట్టేసి క్లియర్ చేసుకుంటారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటారు. కానీ ఓ వాహనదారుడు మాత్రం ఏకంగా 179 చలాన్లు పెండింగ్లో పెట్టుకున్నాడు. వాటి మొత్తంపై రూ. 42 వేలకు పైగా జరిమానా పెట్టుకుని.. దర్జాగా రోడ్లపై తిరుగుతున్నాడు. ఇన్ని రోజులు నిర్భయంగా రోడ్లపై తిరిగిన అతను మాత్రం.. సోమవారం రాత్రి పోలీసుల తనిఖీల్లో ఈ చలాన్లన్నీ బయటపడతాయని భయమేసిందో ఏమో.. లేదంటే ఆ జరిమానా పైసలు పెడితే కొత్త బైక్ కొనుక్కోవచ్చని అనుకున్నాడో ఏమో.. అంతే బండి అక్కడే వదిలేసి పరారయ్యాడు.
పోలీసులు షాక్
179 challans on one bike: హైదరాబాద్ అంబర్పేట్ అలీ కేఫ్ ప్రధాన కూడలి వద్ద.. సోమవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన వాహనదారుడు పోలీసులను చూసి బైక్ అక్కడే వదిలేసి పరారయ్యడు. అనుమానం వచ్చిన పోలీసులు.. ఆ బైక్ నంబర్ AP 23M 9895 ను ఈ చలాన్లో తనిఖీ చేశారు. ఏకంగా ఆ బైక్పై 179 చలాన్లతో.. 42,475 రూపాయల జరిమానా ఉంది. అంతే ఆ మొత్తాన్ని చూసి అవాక్కవ్వడం పోలీసుల వంతైంది.