Accidents on NH 167: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న 167 వ నంబర్ జాతీయ రహదారి... ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం నుంచి... నారాయణపేట జిల్లా టైరోడ్ వరకూ సుమారు 172 కిలోమీటర్ల మేర.... ఈ రహదారి విస్తరించి ఉంది. సరుకు రవాణా వాహనాలు, లారీలు, బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు నిత్యం వేలాదిగా ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి. ఈ క్రమంలో వివిధ కారణాల వల్ల ఈ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల అతివేగంగా వచ్చిన కారు... ఆటోను ఢీ కొన్న ప్రమాదంలో ఐదుగురు చనిపోగా... రెండేళ్ల కిందట మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద ఆటోను- లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. అమ్మాపూర్ రోడ్డు నుంచి హైవేపైకి వస్తుండగా జరిగిన మరో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా... పెద్దగోప్లాపూర్‌లో రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ కొట్టి చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ రహదారిపై ఏటా సగటున 70కి పైగా ప్రమాదాలు జరుగుతుండగా... 60 మంది మరణిస్తున్నారని, 70మందికి పైగా క్షతగాత్రులు అవుతున్నారని అనధికారిక అంచనా.
సూచిక బోర్డులు లేవు
Road accidents: అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికితోడు రహదారిపై స్పీడ్ బ్రేకర్లు, ఎక్కడెక్కడ ఎంతవేగంతో వెళ్లాలన్న సూచిక బోర్డులు లేకపోవడం మరో కారణం. గ్రామాల నుంచి జాతీయ రహదారికి రోడ్డు కలిసే చోట... వేగ నియంత్రికలు లేకపోవడంతో ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.
'ఈ జాతీయ రహదారిపై భారీ వాహనాలు ఎక్కువగా వెళ్తుంటాయి. రహదారిపై సూచిక బోర్డులు కానీ, స్పీడ్ బ్రేకర్లు కానీ లేవు. దీంతో గ్రామాలకు వెళ్లే దారిలో చౌరస్తాల వద్ద వేగం నియంత్రణ కావడం లేదు. ఫలితంగా అధికంగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. రాత్రి వేళల్లో ఎక్కడ పడితే అక్కడ లారీలు ఆపడంతో వెనుక నుంచి వచ్చే వారు చూసుకోకపోవడంతో ప్రాణ నష్టానికి దారితీస్తోంది. కోదాడ- రాయచూర్ మార్గంలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇకనైనా అధికారులు పట్టించుకొని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి.' -స్థానికులు
నిర్లక్ష్య వైఖరి