తెలంగాణ

telangana

ETV Bharat / crime

Tollywood drug case: టాలీవుడ్​ డ్రగ్స్​ కేసులో కొత్త ట్విస్ట్​!

Tollywood drug case: సంచలనం సృష్టించిన టాలీవుడ్ మత్తు మందుల వ్యవహారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన దర్యాప్తు తుస్సుమంది. మత్తుమందుల దిగుమతితోపాట నిధుల మళ్లింపు వ్యవహారం నిగ్గు తేల్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియ మొదలు పెట్టే అవకాశం ఉంది.

Tollywood drug case
Tollywood drug case

By

Published : Dec 8, 2021, 7:00 AM IST

Updated : Dec 8, 2021, 9:45 AM IST

ఆధారాల్లేవ్​.. ఇక టాలీవుడ్​ డ్రగ్స్​ కేసు ముగిసినట్టేనా?!

Tollywood drug case: 2017లో ఆబ్కారీ శాఖ నమోదు చేసిన కేసులతో టాలీవుడ్ మత్తు మందుల వ్యవహారం తొలుత తెరపైకి వచ్చింది. సుదీర్ఘంగా దాదాపు మూడేళ్లపాటు జరిగిన ఈ దర్యాప్తులోనూ చెప్పుకోదగ్గ ఆధారాలేవీ లభించలేదు. ఇప్పుడు ఈడీ దర్యాప్తు కూడా ఇలానే ముగిసిపోనుంది. నాలుగేళ్ల క్రితం.. 2017 జులైలో ఆబ్కారీ అధికారులు కెల్విన్ మార్కెరాన్స్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి మత్తుమందులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మందికి తాను మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించాడు. దాంతో కలకలం రేగింది.

దర్యాప్తులో భాగంగా అప్పటి ఆబ్కారీశాఖ సంచాలకులు అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మందిని పిలిచి విచారించి, వారి వాంగ్మూలం నమోదు చేశారు. మత్తు మందులు వాడేదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరిలో కొందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరపడంతోపాటు సాక్ష్యులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినప్పటికీ మత్తు మందుల వాడకానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలూ లభించలేదు.

ED Investigation on Tollywood drug case: ఆబ్కారీ దర్యాప్తు ముగిసిపోయిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు మళ్లీ టాలీవుడ్ మత్తుమందుల వ్యవహారంపై కొత్తగా గత ఆగస్టు నెలలో కేసు నమోదు చేశారు. మత్తుమందుల దిగుమతితోపాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. దీనిలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని పిలిపించి విచారించారు. ఇందులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోపాటు రవితేజ, రాణా, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖులు ఉన్నారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు.

ఆగస్టు 31న మొదలైన ఈ విచారణ సెప్టెంబరు 22 వరకు కొనసాగింది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపినప్పటికీ మత్తు మందుల దిగుమతి, వాడకం, నిధుల మళ్లింపు వంటి అంశాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలుస్తోంది. దాంతో కేసు మూసివేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే చట్టపరమైన ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఎంతో సంచలనం సృష్టించిన టాలీవుడ్ మత్తుమందుల కేసులో రెండు వేరువేరు దర్యాప్తు సంస్థలు... దర్యాప్తు జరిపినప్పటికీ ఆధారాలు సేకరించలేకపోయాయి.

ఇదీ చూడండి: మళ్లీ డ్రగ్స్​ కలకలం.. భయంతో బాత్​రూంలో దాక్కున్న నటి!

Last Updated : Dec 8, 2021, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details