Tehsildar Srinivasa Rao committed suicide: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు తహసీల్దార్ శ్రీనివాసరావు బలవన్మరణం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయమే కార్యాలయ సిబ్బందితో అల్పాహారం తెప్పించుకున్న ఆయన, దాన్ని తినకుండానే ఉరేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. తీవ్ర పని ఒత్తిడి, అధికారుల మందలింపు కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని.. మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
విజయనగరంలో పౌర సరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేసిన శ్రీనివాసరావు పదోన్నతిపై అల్లూరి జిల్లా పెదబయలుకు తహసీల్దార్‌గా వెళ్లారు. తన కార్యాలయం పక్కనే రేకుల షెడ్డులో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య లక్ష్మీశివసరోజా, ఏడాదిన్నర వయసున్న పాప ఉన్నారు. సౌమ్యుడైన ఆయన విధుల్లో నిష్పక్షపాతంగా పనిచేసేవారు. ప్రభుత్వం ప్రారంభించిన భూ సర్వే కారణంగా సమీక్షలు, సమావేశాలతో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది.
ఇటీవల జిల్లా కేంద్రం పాడేరులో కలెక్టర్ ఇదే అంశంపై తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. అందులో శ్రీనివాసరావును ఇద్దరు అధికారులు తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలిసింది. మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు ఒత్తిడి తట్టుకోవడం కష్టంగా ఉందని.. చనిపోతానని తమకు చెప్పారంటూ సహచర సిబ్బంది వాపోయారు. అలాంటి తీవ్ర నిర్ణయాలు వద్దని.. సెలవుపై వెళ్లాలని సూచించామన్నారు. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడడం విషాదాన్ని నింపింది.
జేసీ శివశ్రీనివాస్, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్, ఆర్డీవో దయానిధి పెదబయలుకు రాగా.. పని ఒత్తిడితోనే శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు సిబ్బంది జేసీకి చెప్పారు. బుధవారమే వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడానని, ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదని జేసీ ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని చూసి బోరున విలపించి కుటుంబసభ్యులు.. ఉరేసుకున్న షెడ్డు కేవలం ఆరు, ఏడు అడుగులే ఉండటంతో ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయన్నారు.