Teacher Beat Students: ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉరవకొండ శివారులోని కేకే పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న మదర్సాలో చదువుతున్న విద్యార్థులను (ముస్లిం పిల్లలు) అక్కడ ఉర్దూ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు (హాజరత్) మహబూబ్ బాషా విచక్షణారహితంగా కొట్టడంతో వారికి వాతలు పడ్డాయి. వీపు, మొహం, తొడలపై ఇలా ఎక్కడ పడితే అక్కడ కర్రలతో, ప్లాస్టిక్ పైపులతో బాధడంతో చిన్నారుల శరీరం మొత్తం బొబ్బలు వచ్చాయి.
మరికొందరికి రక్తస్రానమైంది. నొప్పిని భరించలేని ఆ చిన్నారులు అర్ధరాత్రి సమయంలో అంతా కలిసి మదర్సా ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకులో పనిచేసే యువకులకు ఈ విషయాన్ని చెప్పగా.. వారు ఉరవకొండ ఎస్సై వెంకటస్వామికి సమాచారం ఇచ్చారు. ఎస్సై సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లగా విద్యార్థుల ఒంటిపై వాతలు, వారు పడుతున్న బాధను చూసి చలించిపోయారు. జరిగిన విషయాన్ని ఎస్సైకి విద్యార్థులు చెప్పారు.
తమకు అన్నం సరిగా పెట్టడం లేదని, వండిన అన్నం ఇంటికి తీసుకెళ్తున్నాడని.. తమకు ఎవరైనా దాతలు ఇచ్చిన డబ్బులు, తమ దగ్గర ఉన్న డబ్బులు కూడా హాజరత్ తీసుకెళ్తున్నాడని ఆ విద్యార్థులు తెలిపారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడడానికి కూడా లేకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ దాదాపు 24మంది విద్యార్థులు ఉండగా ప్రతి ఒక్కరు ఆ ఉపాధ్యాయుడి వల్ల ఇబ్బంది పడుతున్నట్లు వారు పేర్కొన్నారు.