తెలంగాణ

telangana

ETV Bharat / crime

TDP Leaders Arrest in Gudiwada: గుడివాడలో ఉద్రిక్తత.. తెదేపా నేతల అరెస్ట్​ - gudivada casino latest news

TDP Leaders Arrest in Gudiwada: : గుడివాడలో క్యాసినో కాక రేగింది. నిజ నిర్ధరణకు వెళ్లిన తెదేపా నేతలు వెనక్కి వెళ్లాలంటూ వైకాపా శ్రేణులూ పోటీగా రోడ్డెక్కడం.. ఉద్రిక్తతకు దారితీసింది. ఆరునూరైనా గుడివాడ క్యాసినో కల్చర్‌ను ప్రపంచానికి తెలియజేస్తామంటూ ముందుకెళ్లిన తెదేపా నేతలను.. పోలీసులు అరెస్టు చేయగా.. బొండా ఉమ కారుపై కొందరు దాడి చేసి అద్ధాలు పగలగొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది.

TDP Leaders Arrest in Gudiwada
TDP Leaders Arrest in Gudiwada

By

Published : Jan 21, 2022, 3:51 PM IST

గుడివాడలో ఉద్రిక్తత.. తెదేపా నేతల అరెస్ట్​

TDP Leaders Arrest in Gudiwada: : తెదేపా, వైకాపా కార్యకర్తల పోటాపోటీ ఆందోళనలు.. కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తతకు దారితీశాయి. సంక్రాంతి సందర్భంగా.. గుడివాడలోని కే-కన్వెన్షన్‌లో మంత్రి కొడాలి నాని క్యాసినోలు నిర్వహించారంటూ.. తెదేపా బృందం నిజనిర్ధరణకు వెళ్లగా.. వారిని వెనక్కి పంపాలంటూ వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. గుడివాడ పార్టీ కార్యాలయం నుంచి కే-కన్వెన్షన్‌కు బయల్దేరిన నేతలను.. నెహ్రూ చౌక్‌ వద్ద పోలీసులు అడ్డుకోగా.. ఆ పక్క వీధిలో వైకాపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి. ఇరువర్గాల మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బలవంతంగా తెదేపా బృందాన్ని వాహనాల్లో ఎక్కించి తరలించారు.

తెదేపా నాయకుల అరెస్టు తర్వాత.. వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. బొండా ఉమ కారు అద్దాన్ని పగలగొట్టారు. గుడివాడ తెదేపా కార్యాలయంపై రాళ్లు రువ్వారు. తెదేపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రాళ్లు రువ్వారు. వైకాపా శ్రేణులను పోలీసులు కనీసం నిలువరించలేదని తెదేపా నేతలు మండిపడ్డారు.

కొడాలి నానిని వెంటనే బర్తరఫ్‌ చేయాలి: బొండా ఉమ

సొంత కన్వెన్షన్‌ సెంటర్‌లో కొడాలి నాని క్యాసినో నిర్వహించారని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్‌ టు వైఎస్సార్‌ పేరిట క్యాసినో నిర్వహించారు. ఎన్టీఆర్‌ పేరుతో అసాంఘిక కార్యకలాపాలను సహించం. సొంత కన్వెన్షన్‌ సెంటర్‌లో గోవా సంస్కృతిని ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లో కరోనా చికిత్స తీసుకున్నా అంటే సరిపోతుందా? ఈ వ్యవహారంలో మంత్రి కొడాలి నానిని తప్పించే వరకు న్యాయపోరాటం చేస్తాం. కొడాలి నాని దొరికిపోయిన దొంగ.. వెంటనే ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి’’ అని బొండా ఉమ డిమాండ్‌ చేశారు.

అంతకుముందు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బయల్దేరిన కమిటీ సభ్యులను పోలీసులు అడుడగునా.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. దావులూరు టోల్ గేట్, పామర్రులో.. వాహనాలు ఆపి సోదాలు చేశారు. ఒక కారుకు మించి అనుమతించబోమని.. పామర్రు- గుడివాడ రహదారి మలుపు వద్ద అడ్డుకున్నారు. తెదేపా నేతలు వాహనాలు దిగి బారికేడ్లు దాటుకుంటూ.. ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు 10 వాహనాలకు అనుమతినిచ్చారు.

తెదేపా నేతల అరెస్టును ఖండించిన లోకేశ్

మహానుభావుల పురిటిగడ్డ గుడివాడని గడ్డం గ్యాంగ్ భ్ర‌ష్టు పట్టించిందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. కే-కన్వెన్షన్ జూదానికి అడ్డాగా మారిన విషయం ప్రపంచం మొత్తం తెలిసినా.. వైకాపా రంగులతో కళ్లు మూసుకుపోయిన పోలీసులకు కనిపించలేదని ధ్వజమెత్తారు. క్యాసినో నడిపి ప్రజల నుంచి వందల కోట్లు కాజేసిన గడ్డం గ్యాంగ్​ను వదిలేసి.. నిజ నిర్ధరణకు వెళ్లిన తెదేపా నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని అయన తీవ్రంగా ఖండించారు. గుడివాడని గోవాడగా మార్చేసిన సూత్రధారులపై.. చర్యలు తీసుకొని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

కొడాలి నానికే ఘనత - కొల్లు రవీంద్ర

"సంక్రాంతి సందర్భంగా కోడి, ఎడ్ల పందేలు నిర్వహిస్తుంటారు. గుడివాడలో కొడాలి నాని మాత్రం క్యాసినో నిర్వహించారు. జూద క్రీడ నిర్వహించిన ఘనత కొడాలి నానికే దక్కుతుంది. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో తెలియట్లేదు" - కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి

ఇదీ చదవండి:కలకలం రేపుతున్న ‘క్యాసినో’ కాక.. గుడివాడలో ఉద్రిక్తత

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details