భద్రాచలంలో ఓ దొంగ తన హస్తలాఘవం చూపించాడు. తన చాకచక్యంతో.. ఎవ్వరికీ కొంచెం కూడా అనుమానం రాకుండా ఓ వ్యక్తి దగ్గరి నుంచి బంగారు ఆభరణాల సంచి లేపేశాడు. అంతా అయిపోయాక చూసుకుంటే తన సంచిలో బంగారు ఆభరణాల బ్యాగు లేదని గుర్తించి లబోదిబోమనటం ఆ బాధితుడి వంతైంది. చాలా సాధారణంగా.. ఏమాత్రం హడావుడి లేకుండా.. దోచేసిన ఈ ఘటన.. స్వామిరారా సినిమాలోని సన్నివేశాన్ని గుర్తు చేసిందంటే నమ్మండి.
బూర్గంపాడుకు చెందిన సత్యవ్రత.. భద్రాచలంలోని యూబీరోడ్డులో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కొన్ని రోజుల కింద బంగారు ఆభరణాలు దాచుకున్నాడు. నిన్న(మే 16) మధ్యాహ్నం పదకొండు సమయంలో.. బ్యాంకు లాకర్ నుంచి తన బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. వాటిని ఓ బ్యాగులో పెట్టుకొని ద్విచక్రవాహనానికి తగిలించిన ఓ పెద్ద సంచిలో ఉంచాడు. అక్కడి నుంచి బయలుదేరిన సత్యవ్రత.. ఓ దుకాణం దగ్గర కవర్లు కొనేందుకు ఆగాడు.
సత్యవ్రతను ఓ ఇద్దరు యువకులు గమనిస్తూనే ఉన్నారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా..? కొట్టేయ్యాలా..? అని ఆతృతగా అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. సత్యవ్రత కవర్లు కొనే దుకాణం దగ్గర అగినపుడు.. అదే సరైన అవకాశం అనుకున్నాడు. బైక్‌పైనే కూర్చున్న సత్యవ్రత.. ముందుకు మాత్రమే చూస్తూ తనకు కావాల్సింది కొంటున్నాడు. ఇక మన దొంగ మాత్రం.. ఏమాత్రం హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా.. సంచిలో ఉన్న బంగారం బ్యాగును తీసేందుకు ప్రయత్నించాడు. కానీ.. మొదటిసారి ప్రయత్నం విఫలమైంది. చుట్టూ జనసంచారం ఉంది.. ద్విచక్రవాహనదారులు వస్తున్నారు.. అయినా ఎలాంటి ఆందోళన పడకుండా.. దొంగ ఇంకోసారి ప్రయత్నించాడు. ఈసారి చాలా చాకచక్యంగా బంగారం బ్యాగును తీసుకుని వెనకకు తిరగకుండా.. హాయిగా నడుచుకుంటూ వెళ్లాడు. అప్పటి వరకు అక్కడే ఓ ద్విచక్రవాహనదారుడు బైక్ స్టార్ట్ చేసి పక్కరోడ్డుకు వెళ్లి దొంగ ముందు ఆపాడు. ఇంకేముంది.. ఆ బైక్ ఎక్కి ఇద్దరు ఎంచక్కా తప్పించుకున్నారు.
బాధితుడు కాసేపటి తర్వాత చూసుకోగా.. సంచి బైక్ నుంచి ఊడిపోయినట్టు కనిపించింది. ఏంటా అని చూసేసరికి.. అందులోని బంగారం బ్యాగు మాయం. తన ఆభరణాల బ్యాగును ఎవరో దొంగిలించారని గుర్తించిన సత్యవ్రత.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బ్యాగులో లక్షా 80 వేల విలువగల బంగారు ఆభరణాలతో పాటు ఇతర డాక్యుమెంట్లు కూడా ఉన్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీకెమెరా దృశ్యాలను పరిశీలించారు. అందులో దొంగల హస్తలాఘవం బయటపడింది. ఆ వీడియోలో ఉన్న యువకులు ఎవరన్నదాన్నిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
"స్వామిరారా" సీన్ రిపీట్.. ఎంత సింపుల్‌గా కొట్టేశాడో మీరూ చూడండి..! ఇవీ చూడండి: