MLA Jeevan Reddy: హైదరాబాద్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి మారణాయుధాలతో సంచరించటం కలకలంరేపింది. బంజారాహిల్స్ రోడ్‌నంబర్ -12 లోని వేమూరీ ఎన్‌క్లేవ్‌లో గల జీవన్‌రెడ్డి నివాసం వద్ద తిరుగుతుండగా... భద్రతా సిబ్బంది గమనించారు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వగా... ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకుని అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వ్యక్తిని వారు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి వద్ద 2 తుపాకులు, కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు... పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు.
తెరాస ఎమ్మెల్యే హత్యకు సర్పంచ్ భర్త కుట్ర..!
10:02 August 02
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి వద్ద వ్యక్తి అనుమానాస్పద సంచారం
నిందితుడు ఆర్మూర్‌కు చెందిన కల్లెటి సర్పంచి భర్త ప్రసాద్‌గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. ఆయుధాలతో సంచరించడంపై బంజారాహిల్స్ పోలీసులు ప్రసాద్‌ను విచారిస్తున్నారు. నిందితుడి వద్ద లభ్యమైన తుపాకీ నకిలీదా..... నిజమైందా అని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రసాద్‌గౌడ్ బెదిరించటం కోసం ఎమ్మెల్యే ఇంటివద్దకు వచ్చాడా... హత్య చేసేందుకు వచ్చాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఆర్మూర్ పరిధిలోని కల్లెటి గ్రామానికి చెందిన ప్రసాద్‌గౌడ్ భార్య లావణ్య... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసి, గెలుపొందారు. అనంతరం, ప్రసాద్‌గౌడ్... తన భార్య తెరాసలో చేరాడు. ఈ సమయంలో పలుకారణాలతో వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అయిన జీవన్‌రెడ్డిపై ప్రసాద్‌గౌడ్ కక్ష పెంచుకున్నట్లు తెరాస నేతలు చెబుతున్నారు.
ఈ ఆరోపణలపై ప్రసాద్ గౌడ్ భార్య, కల్లెడ సర్పంచ్ లావణ్య స్పందించారు. తన భర్తకు అలాంటి ఉద్దేశం లేదని.. ఎమ్మెల్యే హైదరాబాద్ రమ్మంటేనే వెళ్లాడని స్పష్టం చేశారు. వాళ్లే కావాలని పిలిపించి.. కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు ఎందుకు తన భర్త హైదరాబాద్‌లో జీవన్ రెడ్డి దగ్గరకు వెళ్తాడని ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు ఇప్పిస్తలేరని భాజపా నుంచి తెరాసలో చేరామని.. అయినా తమకు బిల్లులు రాలేదు సరి కదా.. సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యేను ఇటీవల తామిద్దరం కలిశామని.. ఇప్పుడు హత్యాయత్నం కింద తన భర్తను ఇరికించడం సరికాదని ఆవేదన వక్తం చేశారు.