Lockup Death in Rayadurgam Police Station: గొర్రెల చోరీ కేసులో అరెస్టై పోలీసుల అదుపులో ఉన్నఓ వ్యక్తి.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చర్చనీయాశంగా మారింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. దీనిపై మృతుడి బంధువులు, స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
లాకప్‌డెత్ జరిగిందని కుటుంబసభ్యుల అనుమానం:ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన ఆంజనేయులు గొర్రెల దొంగతనానికి పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించగా.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆంజనేయులు కంప్యూటర్ రూమ్‌లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్తుండగా.. లాకప్‌డెత్ జరిగిందని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం: దీనిపైమృతుడి కుటుంబ సభ్యులతో.. పోలీసులు ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.7లక్షలు చెల్లించేందుకు పెద్దమనుషుల సమక్షంలో అంగీకరించినట్లు తెలుస్తోంది. ముందుగా రూ. 5 లక్షలు చెల్లించారని.. మిగతా మొత్తం పోస్ట్‌మార్టం అయిన వెంటనే చెల్లిస్తామని.. పోలీసులు తెలిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మృతుల కుటుంబ సభ్యులను పోలీసులే ప్రత్యేక వాహనాల్లో ఆత్మకూరు మండలం సనప గ్రామం నుంచి రాయదుర్గం తరలించారు.
రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో ఆంజనేయులు మృతదేహాన్ని చూసిన వెంటనే భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం వారిని మీడియా కంట కనబడకుండా ప్రత్యేక గదిలో ఉంచారు. ఈ ఘటనపై స్పందించిన అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప.. రాయదుర్గం అర్బన్ సీఐ శ్రీనివాసులు, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును సస్పెండ్ చేశారు. గొర్రెల దొంగ ఆంజనేయులు అనుమానాస్పద మృతిపై.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు వివరించారు. కళ్యాణదుర్గం ఆర్డీవో నిశాంత్ రెడ్డి, అనంతపురం డీఎప్పీ మహబూబ్ భాషాను దీనిపై విచారణకు ప్రభుత్వం నియమించిందని చెప్పారు.
పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు : పోలీసు అధికారులు మృతుడి కుటుంబ సభ్యులతో లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల వేధింపుల కారణంగా మృతి చెందిన ఆంజనేయులను.. ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తెలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంజనేయులు మృతదేహానికి రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇవీ చదవండి:కామారెడ్డి మాస్టర్ ప్లాన్.. భూమి పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం
'విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన భాజపా నేతలు.. 3గంటలు ప్రయాణం ఆలస్యం'