కరోనా చికిత్సలో వినియోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కోసం ఓవైపు.. బాధితుల కుటుంబ సభ్యులు కష్టపడుతుంటే.. మరోవైపు కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఈ ఇంజన్లను బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టణంలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడి చేశారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్ విక్రయం గుట్టురట్టు చేశారు.
బ్లాక్‌లో రెమ్‌డెసివిర్ విక్రయం.. 11 మంది అరెస్టు - remdesivir injection sales in suryapet district black market
కరోనా చికిత్సలో వినియోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠా సూర్యాపేట జిల్లా పోలీసులకు చిక్కింది. 11 మందిని అరెస్టు చేసి వారి నుంచి 30 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడి చేసి గుట్టును రట్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ ఆస్పత్రుల మేనేజర్లతో పాటు ఆత్మకూరు(ఎస్) మండలానికి చెందిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఇంజక్షన్ల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్మార్కెట్లో ఒక్కో ఇంజక్షన్‌ను రూ.35 వేలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. మొత్తం 11 మంది సభ్యులున్న ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ తెలిపారు.
ఈనెల 10న మిర్యాలగూడలో ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 138 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. కరోనా ఆపత్కాలంలో కృత్రిమ కొరత సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
- ఇదీ చదవండి :కరోనా కష్టకాలంలో నర్సుల పాత్ర అనిర్వచనీయం..!