Superstition Crimes : నల్గొండ జిల్లా దేవరకొండలో మహంకాళి పాదాల దగ్గర మొండెం లేని తల కనిపించిన ఉదంతం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో టీసీఎస్ ఉద్యోగి శ్రీకాంత్‌గౌడ్‌తోపాటు భార్య, కూతురు నుదుట బొట్లతో విగతజీవులుగా మారిపోయిన వైనం.. జగిత్యాల జిల్లాకేంద్రంలో పట్టపగలే నాగేశ్వర్రావుతోపాటు ఆయన ఇద్దరు కొడుకులను బరిసెలతో పొడిచి చంపేసిన ఉన్మాదం.. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం కాషాగూడెంలో గోరిమియా కుటుంబంపై కర్రలతో తెగబడిన దురాగతం.. కేవలం పది రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెలుగు చూసిన దారుణాలివి. పేదా ధనికా.. తేడా లేదు. అక్షరాస్య, నిరక్షరాస్యులనే భేదం లేదు. ఉన్నదల్లా ఒక్కటే మూఢవిశ్వాసం. అదే వీటికి కారణం.
శాస్త్రసాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మూఢవిశ్వాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఏపీలో మదనపల్లె దురాగతం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో భార్యభర్తలు, కూతుళ్లిద్దరూ విద్యాధికులే. అయినా అంతా కూడబలుక్కుని క్షుద్రపూజలకు బానిసలుగా మారిన వైనం నివ్వెరపరిచింది. ఇలాంటి ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో తరచూ వెలుగుచూస్తున్నాయి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మాత్రమే కాదు.. హైదరాబాద్‌తోపాటు పరిసరాల్లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి.
జీనోమ్‌వ్యాలీ లాంటి అత్యాధునిక హంగులున్న శామీర్‌పేటలో రెండేళ్ల కిందట మంత్రాల నెపంతో కాలుతున్న చితిలోనే ఓ వ్యక్తిని పడేసి సజీవదహనం చేసిన దారుణం విస్తుపోయేలా చేసింది. రంగురాళ్లతో జాతకం మార్చేస్తామంటూ సర్వం దోచుకెళ్లే దొంగబాబాల లీలలు సాధారణమయ్యాయి. పాతబస్తీలో ఇలాంటి బురిడీబాబాల ఆగడాలు ఇప్పటికీ రాజ్యమేలుతూనే ఉన్నాయి. గత ఏడాది ఖమ్మం జిల్లా మధిర, ఆసిఫాబాద్ జిల్లా ధనోరా(పి), జగిత్యాల జిల్లా కేంద్రం టీఆర్‌నగర్, కొడిమ్యాల, సూర్యాపేట జిల్లా యర్కారం, మోతె, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలలో పలు దారుణాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి దురాచారాలను రూపుమాపే దిశగా చిత్తశుద్ధితో కూడిన కృషి జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో అత్యధికం
జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం మంత్రాలు చేస్తున్నారనే నెపంతో 2020లో దేశవ్యాప్తంగా 88 హత్యలు జరిగాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 17, ఛత్తీస్‌గఢ్‌లో 16, ఝార్ఖండ్‌లో 15, ఒడిశాలో 14 చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ల్లో 4 చొప్పున, గుజరాత్, మహారాష్ట్రల్లో 3 చొప్పున, మేఘాలయాలో 2, తెలంగాణ, రాజస్థాన్‌ల్లో ఒక్కోటి వెలుగుచూశాయి.
నిర్మూలన చట్టం ఊసెక్కడ?
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రజావైద్యుడు, మూఢనమ్మకాల వ్యతిరేక పోరాట నాయకుడు డా.నరేంద్ర ధబోల్కర్‌ను గతంలో మతోన్మాదులు హత్య చేశారు. అనంతరం ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహానికి తలొగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం 2013లో మూఢమ్మకాల నిర్మూలన చట్టం చేసింది. 2017లో కర్ణాటక, 2018లో అసోంల్లోనూ ఈ తరహా చట్టాలు అమల్లోకి వచ్చాయి. అంతకుముందు బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్‌ల్లోనూ ఈ చట్టాలున్నాయి. కానీ తరచూ దారుణాలు వెలుగుచూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చట్టాలు రూపుదాల్చడం లేదు. ఫలితంగా మంత్రతంత్రాల పేరిట ఫిర్యాదులొస్తున్నా కఠినచర్యలు లేవు. మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రావడం లేదు.
ఎలాంటి సంఘటనలంటే..
- వ్యక్తులు మరణించినా సరే బతికొస్తారన్న నమ్మకంతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం.
- అనారోగ్యంతో ఎవరైనా మరణిస్తే మంత్రాలే కారణమని అనుమానితులపై దాడులు చేయడం.
- మృతుడిని బతికించేందుకు క్షుద్రపూజలు చేయాలని అనుమానితుడిని ఒత్తిడి చేయడం.
- క్షుద్రపూజలతో నరబలి ఇస్తే అతీంద్రియశక్తులు వశమవుతాయని నమ్మడం.
- ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చిన్నారుల్ని బలి ఇవ్వడం.