- అతడో పాత నేరస్థుడు. ఇప్పటికీ కొన్ని కేసులు నడుస్తున్నాయి. కుటుంబం కోసం నేరాలు మానుకుని సాధారణ జీవితం గడుపుతున్నాడు. అతడి కుమారుడికి అనారోగ్యం సోకడంతో డబ్బు అవసరమైంది. ఈ విషయాన్ని మరో పాత నేరస్థుడు గుర్తించాడు. ఆ డబ్బును ఎరగా చూపి.. అతడిని ఓ హత్యానేరంలో భాగస్వామిగా చేశాడు.
- మరో కేసులో సూత్రధారులు.. ఇల్లు గడవని స్థితిలో ఉన్న ఒక నిరుపేదకు డబ్బు ఆశ పెట్టి, అతడితో హత్య చేయించారు. ఇదే నేరంలో పాల్గొన్న మరో కుటుంబ సభ్యులు కొద్దిపాటి సొమ్ముకు ఆశపడి ఈ రొంపిలో దిగారు.
supari murders in telangana : రాష్ట్రంలో రోజురోజుకి కిరాయి హత్యలు పెరుగుతున్నాయి. డబ్బు కోసం ప్రాణాలు తీసేందుకు సిద్ధమయ్యే హంతకులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పగ, ప్రతీకారాలతో తమకు నచ్చని వారిని హతమార్చాలనుకునేవారి డబ్బు ఎరగా చూపి.. సుపారీ ఇచ్చి.. కిరాయి మనుషులతో హత్యలు చేయిస్తున్నారు. డబ్బు ఎరకు చిక్కి వారు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
చిన్న నేరస్థుడు హంతకుడిగా మారి..కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మారుతీరావు తన అల్లుడు ప్రణయ్‌ను హతమార్చేందుకు కుట్ర పన్నాడు. నల్గొండ జిల్లాలో పాత నేరస్థుడైన అబ్దుల్‌బారీని సంప్రదించాడు. కోటి రూపాయలకు ఒప్పందం కుదిరింది. అబ్దుల్‌బారీ తనలాంటి నేపథ్యమే ఉన్న అస్గర్‌అలీతోపాటు బిహార్‌కు చెందిన సుభాష్‌శర్మను రంగంలోకి దింపాడు. ప్రణయ్‌ని హత్య చేసే క్రమంలో శర్మ రెండుమూడుసార్లు ప్రయత్నించి భయంతో వెనక్కి తగ్గాడు. చివరకు సూత్రధారులు గట్టిగా ఒత్తిడి చేయడంతో హతమార్చాడు.
రోడ్డున పడిన వ్యక్తితో రూ. 10 లక్షల బేరం :ఆ మధ్య భువనగిరికి చెందిన రామకృష్ణ హత్యోదంతంలో ప్రధాన సూత్రధారులు.. ఓ నిరుపేదకు రూ. 10 లక్షల ఆశచూపి రంగంలోకి దింపారు. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్న రామకృష్ణ హత్యకు మామ వెంకటేశ్ పథకం వేశాడు. తన మిత్రుడైన యాదగిరి ద్వారా లతీఫ్‌తో రూ.పది లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. లతీఫ్ తన భార్య దివ్య ద్వారా ధనలక్ష్మిని, ఆమె ఇద్దరు కుమారుల్ని రంగంలోకి దింపాడు. మోత్కూరు నుంచి హైదరాబాద్ వచ్చిన లతీఫ్.. తన టీ దుకాణం రోడ్డు విస్తరణలో పోవడంతో బతుకుతెరువు కోల్పోయాడు. ధనలక్ష్మి.. వేములవాడ దేవాలయం వద్ద తాయెత్తులు అమ్ముతూ జీవించేది. తనతోపాటు తన కుమారులిద్దరికీ రూ.30 వేల చొప్పున ఇస్తామంటే సరే అంది. హత్య తామే చేస్తామని, శవాన్ని తీసుకొచ్చేందుకు సహకరిస్తే చాలని ముందుగానే లతీఫ్ ఆమెతో చెప్పినట్లు సమాచారం.