Predatory loan apps ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్ రుణయాప్‌ల ఆగడాలకు అడ్డేలేకుండాపోతోంది. అవసరం లేకున్నా పదేపదే ఫోన్‌లు చేసి రుణం తీసుకునేలా ప్రేరేపించడం.. ఆ తర్వాత సకాలంలో చెల్లించలేదంటూ వేధింపులకు దిగడం ఆ రాష్ట్రంలో పరిపాటిగా మారింది. వడ్డీలకు చక్రవడ్డీలు విధించి ఇచ్చిన దానికన్నా రెట్టింపు వసూళ్లకు పాల్పడటంతో పాటుగా... తిరిగి చెల్లించని వారి ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి బంధువులు, స్నేహితులకు పంపి పైశాచికానందం పొందుతున్నారు. వీరి బాధలు భరించలేక చాలామంది మానసికంగా కుంగిపోతుండగా.. మరికొందరు బలవంతంగా తనువు చాలిస్తున్నారు. ఇటీవలకాలంలో వీరి ఆగడాలు మరింత పెరిగిపోవడంతో మూడు నెలల కాలంలోనే ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన కోన సతీష్, మచిలీపట్నానికి చెందిన ప్రత్యూష, అన్నమయ్య జిల్లా మేడికుర్తికి చెందిన యశ్వంత్‌కుమార్ బలవన్మరణం చెందారు. రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆర్థిక ఇబ్బందులతో రుణయాప్ నుంచి అప్పు తీసుకుని.. తిరిగి చెల్లించకపోడంతో వారి అశ్లీల దృశ్యాలను తయారుచేసి.. అందరికీ పంపిస్తామంటూ వేధించడంతో.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఇద్దరి పిల్లలూ అనాథలయ్యారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో శివ అనే యువకుడు ఉరివేసుకుని చనిపోయాడు.
వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చంటూ ఆశఎలాంటి హామీ లేకుండా రుణాలిస్తామంటూ ఫోన్లు చేసి.. నిరుపేదలను రుణయాప్‌ల ద్వారా అప్పుల ఊబిలోకి దింపుతున్నారు. వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చంటూ ఆశపెడుతున్నారు. మరికొందరిని చేర్చితే కమీషన్ ఇస్తామంటూ రుణయాప్ నిర్వాహకులు విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చిరువ్యాపారులు, గృహిణులు, కళాశాల విద్యార్థులను వీరు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. చెల్లింపు గంట ఆలస్యమైనా యాప్ నిర్వాహకుల నుంచి తీవ్రమైన బెదిరింపులు ఎదురవుతున్నాయి. డబ్బు తిరిగి చెల్లించినా ఇంకా ఇవ్వాలంటూ వేధిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బు చెల్లించకుంటే ఫోటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీలంగా మార్చి.. బంధుమిత్రులకు పంపుతారు. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ... అసభ్య సందేశాలను జతచేస్తారు. తీవ్ర మనస్తాపానికి గురవుతున్న బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.