ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. లోకోపైలట్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ప్రాణాపాయం తప్పింది.కానీ, ఆ యువకుడు తన రెండు పాదాలు కోల్పోయాడు. క్షతగాత్రుడిని తాడేపల్లిలోని నులకపేటకు చెందిన పృథ్వీగా గుర్తించారు.
ముంబయి నుంచి కాకినాడకు 100 కిలోమీటర్ల వేగంతో లోకమాన్య తిలక్ (ఎల్‌టీటీ) ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు తీస్తోంది. కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ సమీపంలో పట్టాలపై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు పడుకున్నాడు. రైలు నడుపుతున్న లోకో పైలెట్లు వంద మీటర్ల దూరంలో గమనించారు. ఒక్కసారిగా ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. ఇంజిన్, ఒక బోగి యువకుడి మీదుగా వెళ్లింది. హఠాత్తుగా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు భీతిల్లారు. ఇంజిన్ నుంచి లోకో పైలెట్ హనుమంతరావు, సహాయకుడు రఘురామరాజు కిందికి దూకి వెనుక బోగి వద్దకు పరుగులు తీశారు.
దాని కింద ఉన్న యువకుడు రెండు కాళ్ల పాదాలు తెగిపోయి రక్తం కారుతూ ఆర్తనాదాలు చేస్తూ కనిపించాడు. అతడిని బయటకు లాగి మరో బోగిలోకి ఎక్కించారు. రక్తం కారకుండా వస్త్రాన్ని చుట్టి నీరు తాగించారు. తెగిపోయిన కాళ్ల పాదాలను పాలిథిన్ కవర్లో భద్రపరిచారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ, కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే జంక్షన్ వరకు అంబులెన్స్ రావడం ఆలస్యమైతే యువకుడి బతకడని భావించిన లోకో పైలెట్లు ఉన్నతాధికారుల ఆదేశాలతో అదే రైలులో విజయవాడకు బయలుదేరారు.
ఈలోపు అధికారులు 5వ నంబరు ప్లాట్‌ఫాంపై 108 అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. రైలు విజయవాడ చేరగానే 108 సిబ్బంది క్షతగాత్రుడిని ఆగమేఘాలపై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడిని 20 ఏళ్ల పృథ్వీగా గుర్తించారు. తాడేపల్లిలోని నులకపేటకు చెందిన వాడని, ప్రస్తుతం మాట్లాడలేక పోతున్నాడని, ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియదని పోలీసులు చెబుతున్నారు.