పీఎస్ సమీపంలోనే ఆత్మహత్యాయత్నం.. చివరికి..! మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం నందిపేట గ్రామానికి చెందిన రైతు చంద్రయ్య సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తమ పొలాన్ని సమీపంలోని రైతు ఆక్రమించాడంటూ మనస్తాపంతో క్రిమిసంహారక మందు తాగాడు. గుర్తించిన పోలీసులు చంద్రయ్యను ఆసుపత్రిలో చేర్పించారు.
ఇదీ అసలు విషయం..
చంద్రయ్య తన పొలంలో పత్తి పంట వేశాడు. పంట మొలకెత్తే సమయంలో సమీపంలోని రైతు ఆ పొలం తనదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్‌తో దున్నించాడు. ఈ ఘటన ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే బుధవారం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ చంద్రయ్య బుధవారం మూసాపేట పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేయకుండా గ్రామ పెద్దలను తీసుకురావాలంటూ పంపించేశారు.
పోలీసుల తీరుతో మనస్తాపానికి గురైన చంద్రయ్య.. ఈ ఉదయం మూసాపేట పోలీస్ స్టేషన్ సమీపంలోకి చేరుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకొని బంధువులు, గ్రామస్థులకు పంపించి.. క్రిమి సంహారక మందు తాగాడు. ఇది గమనించిన పోలీసులు చంద్రయ్యను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నేను ఒక భూమి సమస్య గురించి మాట్లాడుతున్నా. మాది 4 ఎకరాల 11 గుంటల భూమి. 2016 నుంచి ఈ గొడవలు జరుగుతున్నాయి. ఎవరూ నా సమస్యకు కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు. అసలు ఆ రోజుల్లో భూములను ఎలా కొలిచారో.. సర్వే నెంబర్లు ఎలా ఇచ్చుకున్నారో తెలియదు. సమస్యపై మండల ఆఫీసులో కలిస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లమంటారు.. పీఎస్‌కు వెళితే ముందు మండల ఆఫీస్‌కు వెళ్లు బాబూ అంటారు. మా ఊరి సర్పంచ్‌ను కలిస్తే నువ్వేమైనా నాకు ఓటేసినవా అంటున్నడు. ఇది న్యాయమేనా అన్నా? ఈరోజు నేను చనిపోతున్నానంటే కారణం మల్లమ్మ, హనుమంతు, కుంటి అంజలన్న, చంద్రప్ప వీళ్లే.. వీళ్లే సార్ 24 గంటలూ నా వెంబడిపడేది. అందుకే చనిపోతున్నా.
-చంద్రయ్య, బాధిత రైతు
ఆరేళ్లుగా తమ పొలం విషయంలో సమీపంలోని రైతులు గొడవ చేస్తున్నారని.. న్యాయం చేయాలంటూ అధికారులు, గ్రామ పెద్దలకు విన్నవించుకున్నామని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరికి చంద్రయ్య ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపారు. బుధవారం జరిగిన ఘర్షణకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. కేసు నమోదు చేయకపోవడంతో స్టేషన్ ముందే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడన్నారు. పోలీసులే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు.
ఇదీ చూడండి: Suicide: 'ఆ బాధ తట్టుకోలేక నేను చనిపోతున్నా'