తెలంగాణ

telangana

ETV Bharat / crime

రోడ్డు ప్రమాదం... సాయం చేయడానికి వచ్చిన వ్యక్తిపై ఎస్సై దాడి - సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించేందుకు సహాయ పడిన ఓ వ్యక్తిపై ఎస్సై దాడికి పాల్పడ్డారు. ఎందుకు జాప్యమైందంటూ చితకబాదారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ పోలీస్​స్టేషన్​లో చోటుచేసుకుంది.

sub inspector attack on driver
సాయం చేయడానికి వచ్చిన డ్రైవర్‌పై ఎస్సై దాడి

By

Published : May 23, 2022, 10:28 AM IST

సంగారెడ్డి జిల్లా పుల్కల్ పీఎస్​​లో రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించేందుకు సహాయ పడిన మరో డ్రైవర్‌పై ఎస్సై దాడి చేశారు. ఎందుకు ఆలస్యమైందంటూ చితకబాదారు. బాధితుడు తెలిపిన వివరాలు... సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల పరిధి ఉమ్నాపూర్‌ శివారులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అందోలు మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన గరిగంటి కిష్టయ్య, సీహెచ్‌ సంగయ్య టీవీఎస్‌ ఎక్సైల్‌ మోపెడ్‌పై సంగారెడ్డి పట్టణానికి వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని రాత్రి వారిద్దరు స్వగ్రామానికి బయలురేరారు. మార్గమధ్యలోని చౌటకూరు మండలం ఉమ్నాపూర్‌ శివారుకు రాగానే ఎదురుగా వచ్చిన టిప్పర్‌... మోపెడ్‌ను ఢీకొంది. కిష్టయ్య(35) అక్కడికక్కడే మృతి చెందగా సంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పుల్కల్‌ ఎస్సై గణేశ్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. టిప్పర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. ఆ వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించేందుకు మరో డ్రైవర్‌ కోసం ఆరా తీశారు. అప్పటికే ఘటనా స్థలం వద్దే ఉన్న నరసింహారెడ్డి టిప్పర్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో వాహనాన్ని కొద్ది దూరం తీసుకెళ్లగానే మొరాయించింది. తనకున్న పరిజ్ఞానంతో ఎలాగోలా టిప్పర్‌ను స్టార్ట్‌ చేసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో జాప్యం జరిగింది. ఈ జాప్యానికి కారణం తెలుసుకోకుండానే ఆగ్రహించిన ఎస్సై గణేశ్‌.. లాఠీతో డ్రైవర్‌ నరసింహారెడ్డిని చితకబాదారు. బాధితుడికి చేతులు, పిక్కలపై ఎర్రటి వాతలు తేలాయి. సాయం చేయడానికి వస్తే అకారణంగా నానైనే దాడి చేశారంటూ నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎస్సై గణేశ్‌ను వివరణ కోరగా.. తాను ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. అనవసరంగా కట్టుకథలు అల్లుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి:యువకులపై ఎస్సై దాష్టీకం.. వీఆర్​కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details