- జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన హర్షవర్ధన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరానికి చెందిన యువతితో కలిసి పంజాబ్‌లో చదువుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోవడం లేదని గత శనివారం విశాఖలోని ఓ హోటల్‌లో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తానూ పోసుకుని ఆత్మహుతికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన హర్షవర్ధన్‌రెడ్డి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. యువతి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది.
- హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి.. కాలనీలో ఉండే యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని ఇరువురు నిర్ణయించుకున్నా యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు. ఇద్దరు బయటకు వెళ్లిపోయి వివాహం చేసుకోవాలనుకున్నా సాధ్యం కాలేదు. యువతికి మరొకరితో వివాహం నిశ్చయించారు. దీంతో ప్రేమించిన యువకుడు క్షణికావేశంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
- రాంనగర్‌కి చెందిన విద్యార్థినిని కాజీపేటకు చెందిన యువకుడు ఏడాదిన్నరగా ప్రేమించాడు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పగా ఎదిరించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ప్రయత్నాలు మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు యువతిని నిర్బంధించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సదరు యువకుడు యువతిని పిలిచి పెళ్లి విషయం ప్రస్తావించగా తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే అని తేల్చి చెప్పింది. దీంతో క్షణికావేశంలో యువతిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
ఈ ఘటనలన్నీ క్షణికావేశంలో చేసినవే. కుటుంబం, భవిష్యత్తు గురించి ఒక్క క్షణం ఆలోచించినా ఈ విషాదాలు జరగకపోయి ఉండేవి. ఆయా కుటుంబాల్లో ఇప్పుడు చీకట్లు అలుముకున్నాయి.
చిరుప్రాయం దాటి యుక్త వయసుకు రాగానే పిల్లల్లో శారీరక మార్పులతో పాటు ఆలోచనా విధానాలు కూడా మారుతుంటాయి.. బాహ్య ప్రపంచపు పైపై మెరుగులనే నిజమని విశ్వసిస్తారు. ప్రేమ, ఆకర్షణ మధ్య సరైన అర్థం తెలుసుకోలేక ప్రేమ అనే ఊహించుకుంటారు. పరిపక్వత లేని వయసులో తాము చేసేదే నిజమని భావిస్తుంటారు. ఆ సమయంలో కలిగే భావోద్వేగాలను నియంత్రించుకోలేక.. తమపై తాము అదుపు తప్పుతుంటారు. ప్రేమ ఒప్పుకోలేదని, ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవని.. ఇలా రకరకాల సమస్యలు తలెత్తినప్పుడు కుదురుగా ఆలోచించి పరిష్కరించుకునే అవకాశమున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండరు. చివరికి క్షణికావేశంలో ఆత్మహత్యలకు, హత్యాయత్నాలకు వెనుకాడటం లేదు.
కుటుంబం గురించి ఆలోచించాలి..
ఇతర ఆకర్షణలకు ప్రభావితమై.. అదే జీవితమని భావించి ఆత్మహత్యలకు, హత్యాయత్నాలకు పాల్పడితే పెంచి పెద్ద చేసిన వారిపైనా ప్రభావం పడుతుంది. సమాజంలో తలెత్తుకోలేక కుమిలిపోతుంటారు. ఇలాంటి చర్యలకు పాల్పడేటప్పుడు కుటుంబం కోసం ఆలోచిస్తే ఆదిలోనే విపరీత ఆలోచనలకు అడ్డుకట్ట పడుతుంది.
నిరంతరం కనిపెడుతూ..
తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు పసిగడుతుండాలి. వారి కదలికలను గమనిస్తుంటే ముందే హెచ్చరించి మరో దారిలోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. అయినా వినకపోతే నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి.
ప్రతి విషయం పంచుకునేలా..
పిల్లలు తల్లిదండ్రులతో ఏ విషయాన్నైనా పంచుకునేలా చూసుకోవాలి. యుక్త వయసులోని వారికి వచ్చే సందేహాలను తల్లిదండ్రులతో చెప్పుకొనేలా నమ్మకం కలిగించాలి. ఎంతటి సమస్య ఉన్నా అమ్మనాన్నలతో చెబితే పరిష్కారవుతుందనే భావన కలిగించాలి.
వీరిని సంప్రదిస్తే పరిష్కారం..