సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలి సుమారు 150 నుంచి 200 మంది వరకు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు, 108 సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. ఆస్పత్రులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లింగయ్య, సైదిరెడ్డి పరామర్శించారు.
ప్రమాద సమయంలో గ్యాలరీల్లో దాదాపు 1500 మంది ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. గ్యాలరీ కూలిపోవడానికి నిర్మాణంలో లోపమా? మరేదైనా కారణమా? అన్నది తేలాల్సి ఉంది.