- ఓ బాలికల గురుకుల పాఠశాలలో కాపలాదారు పదోతరగతి బాలికపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడటంతో వికారాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
- యాలాల మండలంలో మతిస్థిమితం లేని బాలికపై ఓ యువకుడు ఇదే విధంగా వ్యవహరించడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- పూడూరు మండలంలో ఐదేళ్ల బాలికపై 50 ఏళ్లు దాటిన వ్యక్తి అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
- వికారాబాద్లో తొమ్మిదోతరగతి చదువుతున్న బాలికను ఆటో చోదకుడు రోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు తీసుకెళ్లి తీసుకొస్తుండేవాడు. ఈ క్రమంలో బాలికను లోబర్చుకుని లైంగిక వాంఛ తీర్చుకున్నాడు.
అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నాం. నైతికత విషయంలో రోజురోజుకు దిగజారుతున్న విషయాన్ని విస్మరిస్తున్నాం. ఇందుకు నిదర్శనమే చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు. అభం, శుభం తెలియని పిల్లల విషయంలో కొందరు మృగాళ్లు ప్రవర్తిస్తున్న తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. బడికి వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు. చట్టాలు కఠినతరం అవుతున్నా.. ఎన్ని శిక్షలు వేస్తున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నెలల్లో 72 పోక్సో కేసులు నమోదయ్యాయంటే తీవ్రత ఎలా ఉందో అర్థం అవుతోంది. వీటికి అడ్డుకట్ట వేయాలంటే తల్లిదండ్రుల్లో అవగాహన, బాలికల్లో చైతన్యం, అప్రమత్తత అవసరం. మంచి, చెడు స్పర్శలపై పాఠశాలల్లో బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల ఏర్పాటైన శక్తి బృందాలు సైతం ఎవరితో ఎలా మెలగాలి, ఎలా రక్షణ పొందాలనే అంశాలపై వివరిస్తున్నాయి.
ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థినులు
పిల్లలు ఏంచేస్తున్నారు..:
ప్రస్తుతం భార్యాభర్తలు పనిచేస్తేనేగానీ ఇల్లు గడవని పరిస్థితి. ప్రేమగా చూసుకునే పిల్లలు దాడులకు గురైతే వారు పడే వేధన వర్ణనాతీతం. ఉరుకుల పరుగుల జీవనంతో హడావుడిగా విధులకు వెళ్లిపోతూ, పిల్లలు ఏంచేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారు. పరిసరాలు, మిత్రులు తదితర అంశాలు వారిని ప్రభావితం చేస్తాయి. పాఠశాలకు వెళ్తున్నారా, ఎవరెవరితో స్నేహంగా ఉంటున్నారు, వారి అలవాట్లను పెద్దలు గమనించాలి. నిత్యం ప్రేమగా మాట్లాడితేనే సమస్య ఉంటే చొరవగా చెప్పుకోగలుగుతారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.
వసతిగృహాల్లో చేర్పిస్తే మేలు..:
లైంగిక దాడుల కేసులను పరిశీలిస్తే ఎక్కువ శాతం వలసలు వెళ్లే ప్రాంతాల్లోనే చోటుచేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒంటరిగా ఉన్న బాలికలను తెలిసిన వారే తినుబండారాలు వంటివి ఆశ చూపి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలా జరుగకుండా ఉండాలంటే ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. లేదంటే వెంట తీసుకెళ్లడం మంచిది.
ప్రయాణంపై నిఘా ..: