తెలంగాణ

telangana

ETV Bharat / crime

'మరీ..ఇంత దారుణమా..? మనము మనుషులమేనా' - పెద్దపల్లి జిల్లాలో పెరిగిపోతున్న హత్యలు

నడి రోడ్డుపై.. చుట్టూ జనం చూస్తుండగా అతి కిరాతకంగా న్యాయవాద దంపతుల్ని హంతమొందించిన ఘాతుకం ఇంకా మనసుల్ని మెలిపెడుతోంది. అత్యంత పాశవిక చర్య తీరుని వీడియోల్లో చూసిన వారంతా 'మరీ..ఇంత దారుణమా..? మనము మనుషులమేనా' అనేలా మాటల్లో చెప్పలేని వేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎంతటి పగ ఉంటే మాత్రం ఇంతటి రాక్షసులుగా ప్రవర్తిస్తారా..? అన్యాయంగా ప్రాణాలు తీస్తారా..? అనే ఆందోళనలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. నేటి సమాజంలో మాయమవుతున్న మానవ విలువల్ని.. దిగజారుతున్న బంధాలను ఈ ఉదంతం ప్రశ్నిస్తోంది.

special story on karimnagar district Murders
'మరీ..ఇంత దారుణమా..? మనము మనుషులమేనా'

By

Published : Feb 19, 2021, 9:44 AM IST

తాళికట్టిన భర్తను గొడ్డలితో మోదడం.. తననే నమ్మి ఇంటికొచ్చిన ఆలిని బండరాయితో చంపడం, ప్రాణమని భావించిన స్నేహితుడిని అతి కిరాతకంగా మట్టుబెట్టడం.. అల్లారు ముద్దుగా పెంచిన కూతురిని జన్మనిచ్చిన తండ్రే మెడకోసి హత్య చేయడం.. ఇలా హత్యల పరంపరలో మనిషిలోని మరో రూపం బయటకొస్తోంది. దాగిన రాక్షసత్వం వికృత చేష్టల్ని లోకానికి చూపుతోంది. ఇలా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా హత్యల దారుణాలు ఏటా పెరుగుతున్నాయి. గతానికి భిన్నంగా పోలీసుల పహారాలు.. పెరుగుతున్న సాంకేతికతలు.. అడుగడుగునా నిఘా కళ్ల పహారాలు ఉంటున్నా.. ప్రాణాల్ని తీసే ఘోరాన్ని మాత్రం ఆపలేకపోతున్నాయి.

స్పందిస్తే ఏమయ్యేదో...!

రెండు బస్సుల్లోని ప్రయాణికులు.. దారిన పోయే వాహనదారులు చూస్తుండగానే రోడ్డుపై న్యాయవాది వామన్‌రావు దంపతులను కత్తులతో దుండగులు దాడి చేస్తున్న చర్య మానవత్వం మాయమైన తీరుని చెప్పకనే చెబుతోంది. ఒకవేళ రెండు బస్సుల్లో ఉన్న పదుల సంఖ్యలోని ప్రయాణికులు ధైర్యం చేసి వారిని అదిరించి.. బెదిరించి ఆపేందుకు ప్రయత్నిస్తే అతను కొన్ని గాయాలతో బతికేవాడేమోననే సంశయాల్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కళ్లముందరే విచక్షణరహితంగా జరుగుతున్న ఘోర కలిని ఆపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం మనషుల్లోని మానవత్వం ఏమవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే సమయంలో ఎవరికి వారుగా తమ ఎదుట చూసిన దారుణాన్ని అలాగే చూస్తూ హతాశులయ్యారని.. తేరుకునే లోపలే ఘోరం జరిగిపోయిందనే వాదన కూడా వినిపిస్తోంది. తమకెందుకులే అనేలా మిన్నకుండి చూస్తుండటం తప్ఫా. అక్కడ తిరగబడేలా ధైర్యం చేయలేకపోయారనే చర్చ జరుగుతోంది.

నెలకో దారుణమనేలా..!

దాదాపుగా ప్రతి నెలకు సగటున ఐదారు హత్యలనేలా దారుణాలు నాలుగు జిల్లాల పరిధిలో కనిపిస్తున్నాయి. ఇక హత్యలే కాకుండా హత్యకు ప్రయత్నించేందుకు దుండగులు చేస్తున్న చర్యలు పెరుగుతున్నాయి. గతేడాదిలో సగటున రెండు రోజులకోసారి హత్యాయత్నాలు చేశారనేది గణాంకాలను చూస్తేనే అర్థమవుతోంది. ఎక్కువగా భూమి సంబంధిత సమస్యలతోపాటు ఆస్తి, అప్పు తగాదాల మూలంగా హత్యలు జరుగుతున్నాయి. పాతకక్షలు ప్రాణాల్ని తీస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరుగురు హత్యకు గురయ్యారు.. క్షణికావేశంలో విచక్షణ కోల్పోతున్న సందర్భాల్లో ఊహించని ఘోరాలు జరుగుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు హత్యలు జరగకుండా ఉండేలా పోలీసులు తమవంతు భద్రత చర్యలు తీసుకోవాలి. బలమైన చట్టాల ప్రాధాన్యతను తెలియజెప్పుతూ ప్రజలు నేరాల బాట పట్టకుండా అవగాహనను పెంపొందించాలి. ఈ దిశగా చర్యలు చూపితేనే నేర చరిత్ర తగ్గే అవకాశం ఉంటుంది.

భర్తను హతమార్చిన భార్య

తనను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిన భర్తను ఆత్మరక్షణలో భాగంగా భార్య హతమార్చింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన ఒడ్నాల రాజగంగారం(45)నకు కథలాపూర్‌ మండలం చింతకుంట గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. రాజగంగారం నిత్యం తాగి ఇంటికి వచ్చి భార్య భాగ్యలక్ష్మితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున దంపతులిద్దరు గొడవ పడగా మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో భార్యను చంపడానికి యత్నించగా ప్రతిఘటించి ఆత్మరక్షణకు కత్తెరతో భర్త కడుపు భాగంలో పొడిచి, రోకలి బండతో తలపై కొట్టడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మృతుని తమ్ముడు శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్‌ రావు తెలిపారు. ఘటన స్థలాన్ని మెట్‌పల్లి సీఐ శ్రీను పరిశీలించారు. కాగా వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details