కస్టమ్స్ అధికారులుగా నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసిన ఇద్దరిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 25 లక్షల నగదు, 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని కడపకు చెందిన సుధాకర్ వృత్తిరీత్యా చేనేత పని చేసేవాడు. డబ్బులు సరిపోకపోవటంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అమాయకులను మోసం చేయడం మొదలుపెట్టాడు.
5 నెలల క్రితం రమణ అనే వ్యక్తి ద్వారా ఏపీలోని విజయవాడుకు చెందిన రాంప్రసాద్‌ను పరిచయం చేసుకున్నాడు. తను ఎయిర్ ఇండియాలో పని చేస్తున్నట్లు ఫేక్ ఐడీ కార్డు చూపించి రాంప్రసాద్‌ను నమ్మించాడు. తనకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తెలుసంటూ చెప్పాడు. నాగార్జున రెడ్డి అనే వ్యక్తిని కస్టమ్స్ అధికారిగా రాంప్రసాద్‌కు పరిచయం చేశాడు. ఎయిర్‌పోర్టులో వివిధ దేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని చెప్పాడు. ఆ స్వర్ణాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తానని రాంప్రసాద్‌ను నమ్మించారు.
32 లక్షలు కేజీ బంగారం
32 లక్షలకు కేజీ బంగారం ఇప్పిస్తానని రాంప్రసాద్‌ను నమ్మించాడు. గత నెల 19వ తేదీన రాంప్రసాద్ 32 లక్షలు తీసుకొని సుధాకర్‌తో కలిసి విమానాశ్రయానికి వెళ్లాడు. రాంప్రసాద్‌ను పార్కింగ్ వద్ద నిలబెట్టి... 32లక్షల నగదు తీసుకొని సుధాకర్ విమానాశ్రయం లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసుకొని సుధాకర్ వేరే దారిలో కడప వెళ్లిపోయాడు. కస్టమ్స్ అధికారిగా నటించిన నాగార్జునకు లక్ష రూపాయలు ఇచ్చిన సుధాకర్... మిగతా డబ్బులు తీసుకెళ్లాడు. భార్యకు 2 లక్షలతో 4 తులాల బంగారం ఇప్పించాడు.
ఆ తర్వాత వారణాసి వెళ్లి అక్కడ హుండీలో 2 లక్షల రూపాయలు వేశాడు. ఐదు రోజుల అక్కడే లాడ్జీలో ఉన్న సుధాకర్ కొంత డబ్బును ఖర్చు చేశాడు. ఈ నెల 5వ తేదీ హైదరాబాద్‌కు చేరుకొని కడపకు వెళ్లేందుకు ఎంజీబీఎస్‌లో ఉండగా... సమాచారం అందుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు నాగార్జున రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సందీప్, సీఐ వెంకట్ రెడ్డి, ఎయిర్ పోర్టు సీఐ విజయ్ కుమార్ సంయుక్త కృషితో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎయిర్ పోర్టులో పట్టుబడే ఏ వస్తువులు బయట అమ్మరని చెప్పారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటే నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు.
ఇదీ చదవండి:ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్... రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్