తెలంగాణ

telangana

ETV Bharat / crime

తల్లిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు - వనపర్తి జిల్లా తాజా వార్తలు

వనపర్తి జిల్లా గోపాల్​ పేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశానికి గురైన ఓ వ్యక్తి కన్నతల్లినే కడతేర్చాడు. గొడ్డలితో అతికిరాతకంగా తలపై నరికి హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

son killed his mother in Gopal Peta mandal, wanaparthi district
వనపర్తి జిల్లాలో కన్నతల్లినే నరికి చంపిన కుమారుడు

By

Published : Apr 17, 2021, 1:37 AM IST

Updated : Apr 17, 2021, 5:09 AM IST

ఓ వ్యక్తి క్షణికావేశంతో కనిపెంచిన తల్లినే పొట్టనబెట్టుకున్న ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. గోపాల్‌పేట మండలం పొలికెపాడుకు చెందిన మంకలి నర్సయ్య - కాశమ్మ దంపతులకు కుర్మయ్య, శివ కుమారులున్నారు. చిన్నకుమారుడు శివకు అదే గ్రామానికి చెందిన రేణుకతో కొన్ని నెలల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి తల్లిదండ్రులిద్దరూ శివ వద్దనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో శివ భార్య రేణుకకు, అతని తల్లి కాశమ్మకు మధ్య కొన్ని రోజులుగా తగాదాలు మొదలయ్యాయి. శుక్రవారం రాత్రి కూడా అత్తాకోడలు గొడవ పడడంతో కాశమ్మ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. కాసేపటి తర్వాత ఆమె తిరిగి ఇంటికి రావడంతో మరోసారి వారి మధ్య గొడవ మొదలైంది. ఆ సమయంలో కాశమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది.

అది గమనించిన కోడలు రేణుక... కాశమ్మ చేతిలోని అగ్గి పెట్టెను లాక్కుంది. వారి గొడవ కారణంగా తీవ్ర కోపోద్రిక్తుడైన కుమారుడు శివ గొడ్డలితో తల్లి మెడపై నరికాడు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిన కాశమ్మ రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:బంగాల్​ ఎన్నికల ప్రచారంపై మరిన్ని ఆంక్షలు

Last Updated : Apr 17, 2021, 5:09 AM IST

ABOUT THE AUTHOR

...view details