తన భర్త నిర్లక్ష్యం.. అతి వేగంతో కారు నడపడంతో కుమారుడు మృతి చెందాడని ఓ మహిళ శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సై కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన రహీం(38), రేష్మ(30) దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె ఆశ్యుబేగం(13), కుమారుడు రెహమాన్(10) ఉన్నారు. శుక్రవారం శంకర్‌పల్లిలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి సాయంత్రం వచ్చి.. అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.
రహీం కారును అతివేగం, నిర్లక్ష్యంగా నడపడంతో శంకర్‌పల్లి మండలం కచ్చిరెడ్డిగూడ గ్రామ శివారులోని మూలమలుపు వద్ద కారు బోల్తా పడింది. దీంతో కారులోని రెహమాన్(10) డోర్ నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తన కుమారుడి మృతికి తన భర్త నిర్లక్ష్యమే కారణమంటూ భార్య రేష్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.