తెలంగాణ

telangana

ETV Bharat / crime

Tragedy : తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టనన్న కుమారుడు.. అంత్యక్రియలు చేసిన కుమార్తె - son denied to cremate father's dead body

కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు ఆ తండ్రి. ఎన్ని ఇబ్బందులెదురైనా కష్టం వారి కాళ్లను కూడా తాకకుండా చూసుకున్నాడు. భార్యా ఇద్దరు పిల్లలతో ఉన్నదాంట్లో ఆనందంగా బతికాడు. కానీ.. కాలం కన్నెర్ర చేసింది. కరోనా మహమ్మారి రూపంలో వచ్చి ఉన్న ఉపాధి పోగొట్టింది. కట్టుకున్న భార్యను, కన్నబిడ్డల్ని పోషించుకోవడానికి అప్పులు చేశాడు. వాటిని చెల్లించలేక అర్ధాంతరంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్ననాటి నుంచి తన కోసం ఎన్నో కష్టాలు పడి.. గుండెలమీద పెట్టుకుని పెంచిన కన్నతండ్రికి అంత్యక్రియలు చేయడానికి కుమారుడు నిరాకరించాడు. చేసేదేం లేక పదేళ్ల కుమార్తెతో దహనసంస్కారాలు నిర్వహించారు. "ఎందుకిలా చేశావ్ నాన్న.. నన్నెందుకు వదిలేసి వెళ్లావ్" అంటూ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు ఆ చిన్నారి పెట్టిన కంటతడి చూసి బంధువులు, స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.

తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టనన్న కుమారుడు
తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టనన్న కుమారుడు

By

Published : Aug 20, 2021, 12:03 PM IST

Updated : Aug 20, 2021, 1:16 PM IST

కట్టుకున్న భార్య, చేతికందొచ్చిన కుమారుడు, పదేళ్ల కుమార్తెతో హాయిగా జీవనం సాగుతోంది. చిన్న సెలూన్ షాపు పెట్టుకున్నా ఉన్నంతలో బాగానే బతుకుతున్నారు. విధి వక్రీకరించింది. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేసింది. వారి జీవితాల్ని అతలాకుతలం చేసింది. మహమ్మారి వ్యాప్తితో సెలూన్ మూతపడింది. లాక్​డౌన్ సడలించినా.. కస్టమర్లు లేక వెలవెలబోయింది. కుటుంబ పోషణ రోజురోజుకి భారమయింది. భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికి చేబదులు తీసుకోవడం మొదలుపెట్టాడు.

ఎందుకు నాన్నా నన్ను వదిలి వెళ్లావ్

ఒక్కొక్కటిగా అవసరాలు పెరిగాయి. ఖర్చు పెరిగింది. చేతిలో చిల్లిగవ్వలేదు. రూపాయి సంపాదన లేదు. గతిలేక తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేయక తప్పలేదు. చేబదులుతో మొదలై.. లక్షల రూపాయలు అప్పులు చేసే వరకు పరిస్థితి దారితీసింది. అప్పులు తడిసిమోపడయ్యాయి. ఓవైపు కుటుంబ పోషణ భారం.. మరోవైపు అప్పులవాళ్ల సాధింపులు.. భరించలేకపోయాడు. లోలోపలే కుమిలిపోయాడు. ఊరంతా అప్పులు చేసి.. నలుగురి నోట్లో నానడం అవమానకరంగా భావించాడు. తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అటు అప్పులు... ఇటు జులాయిగా మారిన కుమారుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన లింగిశెట్టి నీలాచలం సెలూన్ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. కరోనా వల్ల షాపు తెరవకపోవడం.. కుటుంబ పోషణ భారమవ్వడం.. అప్పులు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చేతికందొచ్చిన 16 ఏళ్ల కుమారుడు.. కాస్తంతైనా సాయపడతాడునుకుంటే.. పోకిరిగా తిరగడం జీర్ణించుకోలేకపోయాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా.. తండ్రికే ఎదురుతిరిగాడు. చేసేదేం లేక రెండ్రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లి పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించాడు. అయినా తీరు మారలేదు.

ఎందుకిలా చేశావ్ నాన్న

తలకొరివి పెట్టేందుకు నిరాకరణ

తీవ్ర మనస్తాపానికి గురైన నీలాచలం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించాలని నీలాచలం కుమారుడికి బంధువులు చెప్పగా.. అతడు నిరాకరించాడు. ఎంత చెప్పినా వికపోవడం వల్ల చివరకు పదేళ్ల కుమార్తెతో నీలాచలానికి జరిపారు.

తండ్రి ఎందుకు చనిపోయాడో అర్థం గాక.. నాన్నకు తనతో ఎందుకు నిప్పు పెట్టిస్తున్నారో తెలియక ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపించింది. "నన్నెందుకు వదిలేసి వెళ్లావ్ నాన్న.. రేపటి నుంచి నాకు చాక్లెట్లు ఎవరు కొనిస్తారు.. క్లాసులు అర్థంకాకపోతే ఎవరు చెప్తారు" అంటూ గుండెలవిసేలా రోదించింది. ఆ పసిదాని కంటతడి చూసి బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

Last Updated : Aug 20, 2021, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details