Vikarabad Accident: అసలే గతుకుల రోడ్డు.. బండి మీద వెనక సీట్లో తల్లి.. ఆదమరపుగా ఉన్న తల్లి బండి మీది నుంచి పడిపోగా కుమారుడు గమనించలేదు. అలాగే సాగిపోతుండగా కొందరు వచ్చి విషయం చెప్పారు. వెనక్కు వెళ్లి చూస్తే తల్లి తీవ్ర గాయాలతో తల్లడిల్లిపోతోంది. గుండెలు బాదుకుంటూ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్పిన అతడు తన అజాగ్రత్త కారణంగా తల్లి ప్రాణాలు పోవడంతో తీవ్రంగా ఆవేదన చెందాడు. నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. మర్నాటి ఉదయానికి చెరువులో అతడి శవం తేలింది!
Vikarabad Accident: తల్లి చావుకు తానే కారణమంటూ.. తనయుడు ఆత్మహత్య - బెన్నూర్ గ్రామంలో విషాదం
Vikarabad Accident: వికారాబాద్ జిల్లా బెన్నూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి మరణానికి తానే కారణమంటూ తీవ్ర ఆవేదనకు లోనై.. చెరువులో దూకి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే ఇంట్లో కొద్ది గంటల్లో తల్లీ, కొడుకు మృత్యువాత పడటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
వికారాబాద్ జిల్లా, యాలాల మండలం, బెన్నూర్ గ్రామంలో చోటుచేసుకున్న విషాదమిది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెన్నూర్ గ్రామానికి చెందిన తలారి నరేష్ (30)కు తండ్రి ఎల్లప్ప, తల్లి లక్ష్మి (60) మరో అన్న, చెల్లి ఉన్నారు. అన్నదమ్ములు చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతుకుతుండగా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. నరేష్ శనివారం తల్లి లక్ష్మిని ద్విచక్ర వాహనంపై కొడంగల్‌లోని గుడికి తీసుకువెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా ఉడిమేశ్వరం గ్రామం వద్ద రోడ్డంతా గుంతలతో నిండి ఉండటంతో వాహనం వెనుక కూర్చున్న లక్ష్మి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయింది. కుమారుడు గమనించకుండా ముందుకువెళ్లాడు. వెనుక వాహనాలపై వస్తున్నవారు చూసి చెప్పడంతో కంగారుగా వెనక్కు వచ్చాడు. తీవ్రంగా గాయపడిన తల్లిని వెంటనే కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు. నరేష్ రోదిస్తూ ఈ విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. బంధువులతో కలిసి ఎల్లప్ప కొడంగల్ చేరుకున్నాడు. కానీ నరేష్ కనిపించలేదు. ఎంతవెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా బొంరాస్‌పేట చెరువు వద్ద పరిశీలించగా గట్టుపై వాహనం, దుస్తులు కనిపించాయి. నరేష్ చెరువులో దూకి ఉండవచ్చనే అనుమానంతో శనివారం అర్ధరాత్రి వరకు వెతికించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం అతడి శవం నీటిపై తేలింది. ఒకే ఇంట్లో కొద్ది గంటల తేడాతో తల్లీ, కొడుకు మృత్యువాత పడటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. తల్లి అంత్యక్రియలు శనివారం ముగించగా, కొడుకు అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం నిర్వహించారు.
ఇదీచూడండి:మేవాత్ ముఠాల క్రైం కహానీ.. చోరీలకు అడ్డొస్తే దారుణంగా ఖూనీ..