సూర్యాపేటలో రూ.20 స్టాంపు పేపరు కొనుగోలు చేయాలంటే అదనంగా రూ.10 చెల్లించాల్సిందే. రూ.100 స్టాంపు పేపరుకు రూ.20 ఎక్కువగా ముట్టజెప్పాలి. బ్యాంకు నుంచి రుణాలు పొందే క్రమంలో అవసరమైన ఫ్రాంక్లిన్ చేయించుకోవాలంటే సూర్యాపేట సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆ మొత్తానికి అదనంగా 10 శాతం సమర్పించుకోవాలి.
జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయం సమీపంలో రూ.20 స్టాంపు పేపరుకు కొంత మంది రూ.100 వసూలు చేస్తుండటం గమనార్హం. ఇదేంటని ప్రశ్నిస్తే కొరత ఉందంటూ సమాధానం చెబుతున్నారు. ఈ అక్రమ వసూళ్లకు ఎంతకీ అడ్డుకట్ట పడటం లేదు. సూర్యాపేటలో నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లు కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు సర్వసాధారణంగా మారాయి. వీటిని కొనుగోలు చేయాలంటే అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
కొన్నేళ్లుగా వీటి విక్రయాల విషయంలో ఎన్ని ఫిర్యాదులు అందినా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. సాధారణంగా ఏదైనా భూమి కొనుగోలు ఒప్పంద పత్రాన్ని పొందాలన్నా, భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా స్టాంపు పేపర్ల అవసరం ఉంటుంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యార్థుల ఉపకార వేతనాలు, హామీ పత్రాలకు వీటిని వినియోగిస్తారు. జిల్లా కేంద్రంలోని కొంత మంది స్టాంపు వెండర్లు అక్రమ వసూళ్లకు తెర తీశారు.
తమ పరపతితో స్టాంపు పేపర్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వీటి కోసం సబ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలోనూ ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా సిబ్బంది కొరత పేరుతో ప్రభుత్వం నుంచి వస్తున్న స్టాంపు పేపర్లను వెండర్లకే అందిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు వినియోగదారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.