Excavations for Hidden Treasures: మూఢ నమ్మకాలతో నిత్యం ఎక్కడో ఒక చోట ఘోరాలు జరుగుతునే ఉన్నాయి. శాస్త్ర సాంకేతికను నమ్ముతున్న రోజులలో మూఢ నమ్మకాలతో నరబలులు ఇవ్వడం వంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరికొంత మంది అయితే తమ ప్రాణాలనే తీసేసుకుంటున్నారు. వాటి గురించి ఎంతగా అవగాహన కల్పిస్తున్నా సరే.. ఇవి ఆగడం లేదు. వాళ్లు నమ్మినదే నిజం అనుకొని.. ఘోరాలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. గుప్తనిధుల కోసం అర్ధరాత్రి వేళ పూజలు చేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. అంతటితో ఆగకుంటా తమతో పాటు ఓ అయిదేళ్ల బాలుడిని కూడా తీసుకొని వచ్చారు. వారిని అందరినీ గ్రామస్థులు పట్టుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడిని తీసుకురావడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే..: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చౌటపల్లిలో గుప్తనిధుల తవ్వకం కలకలం సృష్టించింది. చెరువు కట్టవద్ద అర్ధరాత్రి వేళ పూజలు చేసేందుకు కారులో వచ్చిన 8 మందిని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సమయంలో అక్కడ నుంచి ఓ ముగ్గురు వ్యక్తుల పరారయ్యారు. మరో అయిదుగురిని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.
వీరితో పాటు అయిదేళ్ల బాలుడిని కూడా తీసుకురావడం పలు అనుమానాలకు తావిస్తోంది. నరబలి ఇచ్చేందుకే ఆ బాలుడిని తీసుకొచ్చారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడకి చేరుకుని అనుమానితులను అదుపులోకి తీసుకుని.. స్టేషన్కు తరలించారు. అనుమానితులు తవ్వకాల కోసం ఓ కారులో రాగా.. పోలీసులు ఆ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.