నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా విపత్తులో ధనార్జనే ధ్యేయంగా అంబులెన్స్ యజమానులు రోగుల జేబులను కొల్లగొడుతున్నారు. ఈ మధ్యకాలంలో అంబులెన్స్‌ల వినియోగం అధికంగా ఉండటంతో నిబంధనలకు నీళ్లు వదిలి ప్రయాణికులను తరలించే వాహనాలను అంబులెన్సులుగా వాడకంలోకి తీసుకొస్తున్నారు. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పాతకాలం నాటి వాహనాలను సైతం మార్పు చేసి అంబులెన్స్‌లుగా ఉపయోగిస్తున్నారు.
ఆర్టీఏ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో మిర్యాలగూడలో అంబులెన్స్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మిర్యాలగూడలో 100 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ ప్రభుత్వ అంబులెన్స్‌లు లేకపోవడం పేదలకు భారంగా మారింది. ప్రజా సంఘాలు, పట్టణ వాసుల అభ్యర్థన మేరకు గతంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏరియా ఆసుపత్రికి సొంత నిధులతో అంబులెన్స్‌ను ఇవ్వడం జరిగింది. అది కాస్తా మూలనపడి ఏళ్లు గడుస్తున్నా దానిని వినియోగంలోకి తీసుకు రావడం లేదు. అంబులెన్స్ యజమానులు సిండికేట్‌గా మారి రోగుల జేబులను కొల్లగొడుతున్నారు. నాసిరకం వాహనాలను వాడి రోగుల ప్రాణాలను హరిస్తున్నారు. ఈ దందాపై ఉన్నత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆంబులెన్స్ వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి అంబులెన్స్‌కు 2 ఎయిర్ బ్యాగ్‌లు అమర్చాలని నిబంధన విధించింది. రోగులు, వారి వెంట ఉండే వారి రక్షణ కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ సౌకర్యం కల్పించేలా నిబంధనలను పాటించాలని ఆదేశించింది. జిల్లాలు, హైదరాబాద్ ప్రాంతాల్లోని షోరూంలో నిర్వాహకులు ప్రయాణికుల కోసం వాడే వాహనాలను కంపెనీల వారికి తెలియకుండా అంబులెన్స్ అని తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాల్లో రాసి ఇస్తున్నారు. కంపెనీవారు ఫామ్ 22 లో ప్రయాణికుల వాహనం అని రాసినప్పటికీ కింది స్థాయిలో ఈ సమస్య తలెత్తుతుంది. ఈ పత్రాల ఆధారంగా రవాణాశాఖ అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
అధికారులు దృష్టి సారించాలి
నిబంధనల ప్రకారం ఎయిర్ బ్యాగులు, రక్షణ సామాగ్రి, ప్రాథమిక చికిత్స కిట్లు లేకుండానే అంబులెన్సులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 100 వరకు ఇలాంటి వాహనాలు మార్కెట్లోకి వచ్చినట్లు సమాచారం. రోగుల తరలింపునకు ఈ తరహా వాహనాలు అంత సురక్షితం కాదు. పోలీసులు, రవాణాశాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన వాహన చట్టం ప్రకారం అంబులెన్స్‌ను వాహనాల కంపెనీల వారే తయారు చేయాలి. ప్రత్యేకంగా రోగి స్ట్రెచర్ బెడ్, ఆక్సిజన్ సిలిండర్, రోగి సహాయకులు కూర్చునే సీట్లు అమర్చుతారు. కంపెనీవారు ఫామ్ 22లో అంబులెన్స్ పేరుతో విక్రయిస్తారు. వీటిని ఆసుపత్రుల వారికి విక్రయిస్తే వారు రవాణా కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.