తెలంగాణ

telangana

ETV Bharat / crime

సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ! - techie murder in hyderabad

Software Engineer Murder in Hyderabad : హైదరాబాద్ కేపీహెచ్​బీ కాలనీలో అదృశ్యమై.. సంగారెడ్డి జిల్లా జిన్నారం అటవీ ప్రాంతంలో శవమై తేలిన నారాయణ రెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసుల అదుపులో నలుగురు నిందితులుండగా.. పరారీలో ఉన్న కీలక నిందితుడు శ్రీనివాస్​రెడ్డి కోసం గాలిస్తున్నారు. యువతి తండ్రి వెంకటేశ్వర రెడ్డి పక్కా ప్రణాళికతో సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హత్యకు రెండు నెలల నుంచే ప్రణాళిక రచించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

techie murder in hyderabad
techie murder in hyderabad

By

Published : Jul 5, 2022, 10:05 AM IST

Software Engineer Murder in Hyderabad : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు నారాయణరెడ్డి హత్యకు మామ కందుల వెంకటేశ్వర్‌రెడ్డి ఇచ్చిన సుపారీ రూ.4.50 లక్షలని తెలిసింది. ఒకే సామాజిక వర్గం అయినా తన కుమార్తెను నారాయణరెడ్డి ప్రేమ వివాహం చేసుకోవడాన్ని భరించలేక సుపారీ ఇచ్చి అల్లుడిని హత్య చేయించినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

ఏపీలోని ప్రకాశం జిల్లా రాజువారిపాలెం యువకుడు నారాయణరెడ్డి (25) హత్యలో కేపీహెచ్‌బీ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పెళ్లి చేసుకుని దిల్లీలో తలదాచుకున్న కుమార్తె, అల్లుడికి నచ్చజెప్పి సొంతూరు తీసుకొచ్చారు. ఘనంగా వేడుక జరిపిస్తామంటూ కుమార్తెను గృహ నిర్బంధం చేశారు. తన కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం, ఆమెకు మళ్లీ పెళ్లి చేద్దామనుకుంటే సంబంధాలను తిరస్కరిస్తుండడం వెంకటేశ్వర్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. దీనికి కారణమైన అల్లుడు నారాయణరెడ్డి హత్యకు పథకం పన్నాడు. బంధువైన శ్రీనివాస్‌రెడ్డిని ఆశ్రయించగా అతను రూ.5 లక్షలు డిమాండ్‌ చేశాడు. చివరికి రూ.50 వేలు తక్కువకు ఒప్పందం కుదిరింది.

షేక్‌పేటలో హత్యకు కుట్ర..శ్రీనివాస్‌రెడ్డి దిల్‌సుఖ్‌నగర్‌లో ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో పని చేస్తున్నాడు. అతను గత నెల 24న గిద్దలూరుకు చెందిన ఆశిక్‌ను తీసుకొని కర్నూలు వెళ్లాడు. అక్కడ అద్దెకు తీసుకున్న కారులో మరో వ్యక్తి కాశీని ఎక్కించుకుని 25న సాయంత్రం నగరానికి వచ్చాడు. షేక్‌పేట సమీపంలో అద్దెకు గది తీసుకున్నారు. అక్కడే నారాయణరెడ్డి హత్యకు పథక రచన చేసినట్టు సమాచారం. జూన్‌ 27న నారాయణరెడ్డిని కారులో బయటకు తీసుకెళ్లి మెడకు టవల్‌ను ఉచ్చుగా వేసి హతమార్చారు. అదే కారులో జిన్నారం శివారు రహదారి పక్కన అటవీ ప్రాంతంలోకి మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు.

కాల్‌ డేటా ఆధారంగా..ఆ తర్వాత నారాయణరెడ్డిని చంపేసినట్టు శ్రీనివాస్‌రెడ్డి.. ఫోన్‌ ద్వారా వెంకటేశ్వర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. కాశీ, ఆశిక్‌తో కలిసి శ్రీనివాస్‌రెడ్డి కారులో కర్నూలు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి మళ్లీ వెంకటేశ్వర్‌రెడ్డికి ఫోన్‌ చేసి తనకు డబ్బు కావాలని అడిగాడు. నెల తర్వాత ఇస్తానని చెప్పడంతో ముగ్గురూ అక్కడి నుంచి విడిపోయారు. ఆశిక్‌ కేపీహెచ్‌బీ కాలనీలోని తన బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. శ్రీనివాసరెడ్డి, కాశీ.. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. నారాయణరెడ్డి అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కాల్‌ డేటా ఆధారంగా కూపీ లాగటంతో ఆశిక్‌ చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే పరువు హత్య బయటపడింది.

ఎముకలే మిగిలాయి..నారాయణరెడ్డిని హత్యచేసి పెట్రోల్ పోసి తగులబెట్టగా.. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే అడవిలో ఉండే జంతువులు నారాయణరెడ్డి మృతదేహన్ని పీక్కుతిన్నాయి. ఎడమ కాలు దూరంగా పడి ఉంది. కేవలం ఎముకలే మిగిలి ఉన్నాయి. శవపరీక్ష అనంతరం చిన్న సంచిలో వాటిని కుటుంబసభ్యులకు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details