డీసీఎం వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ సాఫ్ట్‌వేర్ మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఏక్‌మినార్ వద్ద జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. అతివేగమే కారణం - రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన వాహనం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జీవితాన్ని చిదిమేసింది. డీసీఎం, ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో హైదరాబాద్‌లోని సుచిత్రకు చెందిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదం ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఏక్ మినార్ వద్ద చోటు చేసుకుంది.
నగరంలోని సుచిత్రలో నివాసముండే శివనాగిరెడ్డి ఉప్పల్-రామంతాపూర్ మార్గంలో ఉన్న ఎన్‌ఎస్‌ఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ల్యాప్‌టాప్ తీసుకొచ్చేందుకు ఆఫీసుకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.
ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఏక్ మినార్ వద్దకు రాగానే రామంతాపూర్ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.