ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కృష్ణలంకకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేశాడు. అనంతరం సాఫ్ట్‌వేర్ కంపెనీ నెలకొల్పాడు. అది సరిగా నడవక.. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టాయి. దీంతో కంపెనీని మూసివేశాడు. అనంతరం (నాలుగేళ్ల క్రితం) నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని అజ్మాపురంలో సాయి మాన్సి ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. తన పేరు విశ్యచైతన్యబాబాగా చెప్పుకొన్నాడు.
ఏడాది క్రితం పీఏపల్లి మండలంలోని సాగర్ వెనుక జలాల సమీపంలో 10 ఎకరాల స్థలంలో ఆశ్రమం నిర్మించాడు. ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. శారీరక, మానసిక రోగాలను ఆధ్యాత్మిక చింతన ద్వారా నయం చేస్తానని ప్రకటించాడు. ఇతడి నిజస్వరూపం గురించి తెలియని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ఆన్‌లైన్, చరవాణి ద్వారా సంప్రదించారు. మొదట్లో తక్కువ ఫీజు తీసుకొని, మాయమాటలు చెప్పి నమ్మించేవాడు. తనను పూర్తిగా నమ్మిన భక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని.. వారితో అసభ్యంగా చాటింగ్ చేయడం, ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నవారి నుంచి డబ్బులు, ఆస్తులు విరాళాలుగా తీసుకోవడం చేసేవాడు.