తెలంగాణ

telangana

ETV Bharat / crime

Car theft in Hyderabad : టెకీ కారు కొట్టేశారు.. టెక్నాలజీకి దొరికేశారు

కొత్తగా కొన్న కారులో స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు వెళ్లాడు. తీరా వచ్చి చూస్తే కారు లేదు. ఏమైందని.. సీసీటీవీలో చూస్తే ఓ వ్యక్తి తన కారు తీసుకెళ్లినట్లు(Car theft in Hyderabad) కనిపించింది. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని ఫోన్ కోసం చూస్తే.. ఆ మొబైల్​ కూడా కారులోనే ఉందని గుర్తొచ్చింది. అసలే సాఫ్ట్​వేర్ ఇంజినీర్.. టెక్నాలజీని వాడటంలో దిట్ట. తన ఫోన్​ జీపీఎస్ ఆధారంగా పోలీసుల సాయం లేకుండానే తన కారును గుర్తించాడు. ఎత్తుకెళ్లిన వారిని పట్టుకున్నాడు ఈ హైటెక్ టెకీ.

Car theft in Hyderabad
Car theft in Hyderabad

By

Published : Nov 8, 2021, 10:24 AM IST

చోరీకి గురైన కారు(Car theft in Hyderabad)ను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పట్టుకుని నిందితులను పోలీసులకు అప్పగించారు టెకీలు. ఈ ఘటన సైబరాబాద్‌ పరిధిలో తాజాగా చోటు చేసుకుంది. బాధితుడు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నాలుగు రోజుల కిందట రూ.30 లక్షల విలువైన కొత్త కారును కొనుగోలు చేశారు. శుక్రవారం రాత్రి గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. వాలెట్‌ పార్కింగ్‌ సిబ్బందికి తాళం అప్పగించి లోపలికెళ్లారు. వేడుక ముగిసిన తర్వాత బయటికొచ్చి కారు తీసుకురావాలని సిబ్బందిని కోరాడు. అరగంట వెతికినా కనిపించడం లేదని చెప్పడంతో బాధితుడు అవాక్కయ్యాడు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి తీసుకెళ్లినట్లు(Car theft in Hyderabad) కనిపించింది. అతనికి తాళం తీయడం రాకపోతే సిబ్బంది సహకరించినట్లు గుర్తించారు. తన మిత్రుడి కారు అని చెప్పడంతోనే సదరు వ్యక్తికి తాళాలిచ్చినట్లు సిబ్బంది వివరించారు.

టోలిచౌకి.. ఆసిఫ్‌నగర్‌.. మెహిదీపట్నం

మిత్రులతో కలిసి గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు బాధితుడు సమాయత్తమయ్యారు. ఆ సమయంలోనే తన మొబైల్‌ కూడా కనిపించలేదు. రింగ్‌ అవుతున్నా ఎవరూ లిఫ్ట్‌ చేయడం లేదని పక్కనే ఉన్న మిత్రులు చెప్పారు. అప్పుడు ఫోన్‌(సైలెన్స్‌ మోడ్‌) కారులోనే ఉండిపోయినట్లు బాధితుడికి గుర్తొచ్చింది. ఫోన్‌.. లాప్‌టాప్‌తో కనెక్ట్‌ అయి ఉన్నట్లు మిత్రులకు చెప్పాడు. అందరూ కలిసి బాధితుడి ఇంటికెళ్లి లాప్‌టాప్‌ను ఓపెన్‌ చేశారు. ఫోన్‌ జీపీఎస్‌ ఆధారంగా కారు తొలుత టోలిచౌకి.. ఆ తర్వాత ఆసిఫ్‌నగర్‌.. అక్కడి నుంచి మెహిదీపట్నం వెళ్లినట్లు స్పష్టమైంది. చివరగా బంజారాహిల్స్‌లోని ఓ మాల్‌ దగ్గర ఆగినట్లు గుర్తించారు. మరో కారులో నలుగురు కలిసి అక్కడికెళ్లారు. దూరంగా నిల్చొని బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారమిచ్చారు.

పారిపోతుంటే గట్టిగా పట్టుకుని...

కారులో ముగ్గురు దొంగలున్నట్లు టెకీలు గమనించారు. 15 నిమిషాలు దాటినా పోలీసులు ఇంకా చేరుకోలేదు. అప్పుడే అక్కడి నుంచి పరారయ్యేందుకు దొంగలు సమాయత్తమవుతున్నట్లు గుర్తించి ధైర్యం చేసి నలుగురు ముందుకెళ్లారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా ముగ్గురిలో ఒకరు పారిపోయారు. ఇద్దర్ని అలాగే గట్టిగా పట్టుకుని అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. చోరీ జరిగిన చోటే ఫిర్యాదు చేయాలని సూచించడంతో గచ్చిబౌలి ఠాణాలో శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వివరాలు ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details