Tractor Accident minor dead: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాకలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను ఓ మైనర్ అతివేగంగా నడపడం వల్ల ఓ ఆరేళ్ల చిన్నారి బలైంది. గ్రామానికి ఇటుకలు తీసుకొచ్చేందుకు ట్రాక్టర్‌ను ఓ మైనర్‌తో పాటు మరో బాలుడు నడపుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డుపై ఎవరూ లేరనే ఉద్దేశంతో ఆ బాలుడు ట్రాక్టర్‌ను మితిమీరినవేగంతో నడుపుతూ వెళ్లాడు. తీరా.. బస్టాండ్ వద్దకు రాగానే.. గేదేలతో పాటు ఓ మహిళ ఎదురుగా వస్తోంది. గేదేలను ఎలా తప్పించుకోవాలో తెలియక.. వేగాన్ని నియంత్రించలేక ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. కట్ చేస్తే ట్రాక్టర్ వెళ్లి కాలువలో పడింది.
గేదెలు వస్తున్నాయని ఆగితే..
బ్రేక్ వేయడానికి.. ట్రాక్టర్ కాలువలో పడటానికి మధ్యలో ఓ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ ట్రాక్టర్ వస్తున్న సమయంలోనే.. రోడ్డుపై వస్తున్న గేదెలను చూసి ఆరేళ్ల బాలిక దీక్షశ్రీ.. పక్కనే నిలబడిపోయింది. గేదెలు వెళ్లాక వెళ్దామనుకున్న దీక్షశ్రీ.. అటుగా దూసుకొస్తున్న ట్రాక్టర్‌ను గమనించలేకపోయింది. అదుపుతప్పిన ఆ ట్రాక్టర్ నేరుగా వచ్చి దీక్షశ్రీని ఢీకొట్టుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీక్షశ్రీ అక్కడికక్కడే మరణించింది. కాలువలో పడిన ట్రాక్టర్ నుంచి ఇద్దరు బాలురు క్షేమంగానే బయటపడ్డారు.