students drown in krishna river: కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు మృతి
19:24 December 10
కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు మృతి
students drown in Krishna river: ఏపీలోని గుంటూరు జిల్లాలో పెనువిషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు మృత్యువాత పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం వేద పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు.. అచ్చంపేట మండలంలోని మాదిపాడు సమీపంలో కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ ఆరుగురు నీటమునిగి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో విద్యార్థుల మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు.
మృతులు హర్షిత్ శుక్లా, శుభమ్ త్రివేది, అన్షుమన్ శుక్లా, శివ శర్మ, నితేష్ కుమార్ దిక్షిత్, సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. వీరంతా ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు కాగా.. సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయుడని, నరసరావుపేటకు చెందిన వాడని పోలీసులు తెలిపారు. మాదిపాడు సమీపంలోని శ్వేత శృంగా చలం వేద పాఠశాలలో గత ఐదేళ్ల నుంచి వేద విద్యను అభ్యసిస్తున్నారు. నదిలో సుడిగుండాల కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాలు జరిగే ప్రదేశంలో కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు. నదిలో ఇంకా విద్యార్థులు ఎవరైనా గల్లంతయ్యారేమోనన్న అనుమానంతో బోట్ల సాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇదీ చూడండి:Tractor accident posanipet : ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు రైతులు దుర్మరణం