శుభకార్యం కోసం గోదావరి తల్లి చెంతకు వెళ్లారు. నదిలో అందరూ కలిసి స్నానం చేశారు. కొందరు మాత్రం కాసేపు నీటిలో ఆడుకుందామనుకున్నారు. ఇటీవలే పెళ్లి కుదిరిన యువకుడు..కాబోయే భార్యతో నీటిలో సరాదాగా అల్లరి చేస్తున్నాడు. ఇంతలోనే ఇద్దరు పిల్లలు జారి నదిలో కొట్టుకుపోయారు. కాపాడేందుకు వెళ్లి మరో ముగ్గురు గల్లంతయ్యారు. వీరి వెంట వెళ్లి మరో ఇద్దరు ప్రవాహంలో చిక్కుకున్నారు. 5 నిమిషాలు ఆనందంగా గడుపుదామనుకున్న ఏడుగురిలో....క్షణాల్లోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద జరిగిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
పుట్టు వెంట్రుకల కోసం.
మాక్లూర్ మండలం గుత్పకు చెందిన నరేశ్ కుమారుడి పుట్టు వెంట్రుకల కోసం... బంధువులతో కలిసి పోచంపాడ్‌లోని గోదావరికి వెళ్లారు. స్నానం చేసేందుకు అందరూ గోదావరి నదిలోకి దిగి.... ఒడ్డుకు చేరారు. కొంతమంది మాత్రం మరో 5 నిమిషాలు స్నానం చేద్దామనుకున్నారు. ఇంతలో ఇద్దరు పిల్లలు నదిలో జారి కొట్టుకుపోయారు. వారిని కాపాడే ప్రయత్నంలో మొత్తం ఏడుగురు నీటిలో గల్లంతయ్యారు. స్థానికులు అప్రమత్తమై ఒక బాలుడిని కాపాడగా..... మిగతా ఏడుగురూ విగతజీవులుగా బయటపడ్డారు.