తెలంగాణ

telangana

ETV Bharat / crime

రూపాయి నోటు చూపితే 2 కోట్లు.. హవాలా నగదు మార్పిడికి ఇదో రూటు! - హైాదరాబాద్ న్యూస్

రూపాయి నోటు చిత్రం వాట్సాప్‌లో చూపితే రూ.2 కోట్లివ్వాలి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో చిక్కిన రూ.2 కోట్ల నగదు మార్పిడికి ఎంచుకున్న మార్గం ఇది. కొరియర్‌ కార్యాలయం ముసుగులో డబ్బునిలా అక్రమంగా పంపుతున్నారు.

one rupee note
రూపాయి నోటు

By

Published : Oct 13, 2022, 11:46 AM IST

రూపాయి నోటు చిత్రం వాట్సప్‌లో చూపితే రూ.2 కోట్లివ్వాలి.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో చిక్కిన రూ.2 కోట్ల నగదు మార్పిడికి ఎంచుకున్న మార్గం ఇది. కొరియర్‌ కార్యాలయం ముసుగులో డబ్బునిలా అక్రమంగా పంపుతున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో ‘ఆకాశ్‌ కాంతి కొరియర్‌ అండ్‌ పార్సిల్‌ సర్వీస్‌’ కార్యాలయం ఉంది. దీని ద్వారా హవాలా సొమ్ము రవాణా అవుతుందనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం రాత్రి పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడిచేసి కార్యాలయం మొత్తం సోదా చేశారు.

అక్కడే ఉన్న టీఎస్‌09 ఈవీ 8201 నంబరు కారును పరిశీలించగా సీటు కింద డబ్బు దాచడానికి ప్రత్యేక అరలాంటి ఏర్పాటుచేశారు. అందులో నగదు రూ.2,00,00,500ను పోలీసులు గుర్తించారు. కార్యాలయ ఇన్‌ఛార్జి, గుజరాత్‌లోని పటాన్‌ జిల్లా చంద్రుమాన ప్రాంతానికి చెందిన అజిత్‌ ఠాకూర్‌ అలియాస్‌ కరణ్‌(39), గాంధీనగర్‌ జిల్లా వేద గ్రామవాసి, డెలివరీ బాయ్‌ దిలీప్‌సింగ్‌ చౌహాన్‌(40), పటాన్‌ జిల్లా సన్సర్‌ గ్రామవాసి, డెలివరీ బాయ్‌ మహేందర్‌ సింగ్‌(26), లాదోల్‌ గ్రామానికి చెందిన, కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న పర్మర్‌ సందీప్‌కుమార్‌(29)లను అదుపులోకి తీసుకొన్నారు.

నగదుతో పాటు లెక్కింపు యంత్రం, కారును స్వాధీనం చేసుకొని బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కొరియర్‌ సర్వీస్‌ను గుజరాత్‌కు చెందిన, బంజారాహిల్స్‌లో నివసించే ఆకాశ్‌ కాంతి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు. గుజరాత్‌కు చెందిన అజిత్‌ దాకర్‌ అనే వ్యక్తి సూచనల మేరకు హైదరాబాద్‌ నుంచి హవాలా రూపంలో ఈ డబ్బును గుజరాత్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

గుజరాత్‌కు వెళ్తోందా? మునుగోడుకా?రూ.2 కోట్ల నగదు తీసుకోవడానికి వివేక్‌ అనే వ్యక్తి రావాల్సి ఉంది. ఆకాశ్‌ కాంతి కొరియర్స్‌ నిర్వాహకుడు డబ్బు సిద్ధంచేసి కారులో పెట్టాడు. వివేక్‌ రావడానికి ముందే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇతడు ఎవరనేది తేలాల్సి ఉంది. వివేక్‌ సెల్‌ఫోన్‌ నంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఉన్న డబ్బు మార్పిడికి రూపాయి నోటు ఆధారంగా మారింది. వివేక్‌కు ముందుగా పంపిన రూపాయి నోటు, దానిపై ఉన్న నంబరు ఆధారంగా హవాలా డబ్బు మార్పిడికి నిర్ణయించుకున్నారు. పోలీసులు పట్టుకున్న హవాలా నగదులో ఏడెనిమిది కొత్త రూపాయి నోట్లూ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో వివేక్‌కు పంపిన నోటు సైతం ఉంది. ఈ డబ్బు గుజరాత్‌కు వెళ్తోందా.. మునుగోడు ఉపఎన్నికకు ఏమైనా సంబంధముందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details