Shilpa Chaudhary case: అధిక వడ్డీ ఇస్తానంటూ కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన శిల్పాచౌదరి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తన వద్ద 2.4 కోట్లు తీసుకుని మోసం చేసిందని నార్సింగి ఠాణాలో మరో మహిళ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది అధిక వడ్డీ ఇస్తానని డబ్బు తీసుకుందని... ఇవ్వకుండా మోసం చేసిందని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటివరకూ నార్సింగి పీఎస్లోనే శిల్పా చౌదరిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి.
కస్టడీ పిటిషన్ వేసిన పోలీసులు
శిల్పా చౌదరి దంపతులు అరెస్ట్ అయి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నిందితును కస్టడీలోకి తీసుకుని కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు ఉప్పర పల్లి కోర్టులో నార్సింగి పోలీసుల ఏడు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు శిల్పా చౌదరి దంపతులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
సమగ్ర దర్యాప్తు జరిగితేనే..
శిల్పా చౌదరి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని కోట్లలో మోసాలు చేసినట్లు అనుమానిస్తున్నారు. వచ్చిన డబ్బుతో ఇద్దరు కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని వెల్లడించారు. అధిక వడ్డీ ఇస్తానని, వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించి.. మోసాలకు పాల్పడేవారని డీసీపీ తెలిపారు. బాధితులను ఆకర్షించేందుకు పేజ్ త్రీ పార్టీలు ఇచ్చి కోట్లలో కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దంపతుల బాధితుల సంఖ్య పూర్తిగా తేలేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:Shilpa Fraud: పార్టీలు ఇచ్చి ఆకర్షించి.. కోట్లలో వసూలు చేసి..