తెలంగాణ

telangana

ETV Bharat / crime

Shilpa Chowdary Cheating Case: శిల్పా చౌదరి కేసులో తెరమీదకు కొత్త పేర్లు

అత్యంత ఖరీదైన ఇంట్లో నివాసం.. ఎవరు దగ్గరకు రాకుండా రక్షణగా నలుగురు బౌన్సర్లు... పార్టీల పేరుతో లక్షల రూపాయల ఖర్చు... నిత్యం హడావుడి... పెళ్లి రోజు వేడుకకు అరకోటి ఖర్చు... కోటిని పది కోట్లు చేస్తానని అధిక వడ్డీలు ఇస్తామంటూ పలువురిన బురిడీ కొట్టించిన శిల్ప దంపతుల కేసు.. మలుపులు తిరుగుతోంది. మరో వైపు ఆసుపత్రి నిర్మాణం కోసం ఇద్దరికి తన వద్ద ఉన్న డబ్బు ఇచ్చినట్టు చెప్పడం... కొసమెరుపు.

Shilpa Chowdary Cheating Case: శిల్పా చౌదరి కేసులో తెరమీదకు కొత్త పేర్లు
Shilpa Chowdary Cheating Case: శిల్పా చౌదరి కేసులో తెరమీదకు కొత్త పేర్లు

By

Published : Dec 5, 2021, 3:30 AM IST

స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట కోట్ల రూపాయలు స్వాహా చేసిన కేసులో నిందితురాలు శిల్పాచౌదరి రెండు రోజుల పోలీసుల కస్టడీ ముగిసింది. న్యాయస్థానం అనుమతితో పోలీసులు ఆమెను రెండు రోజుల పాటు పలు అంశాలపై ప్రశ్నించారు. మొదటిరోజు విచారణలో శిల్ప చూపిన అమాయకత్వమే రెండోరోజు ప్రదర్శించింది. తనకేం తెలియదంటూ బుకాయించి బయటపడే ప్రయత్నం చేసినట్టు సమాచారం. పోలీసుల ప్రశ్నలతో భావోద్వేగానికి గురై పలుమార్లు కన్నీరు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తన మెదడు మొద్దుబారిందని కొద్దిసేపు ఒంటరిగా వదిలేయమంటూ ప్రాధేయ పడినట్టు సమాచారం. మహిళా పోలీసు అధికారి సమక్షంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ... ఆమె నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే పరిచయస్తుల వద్ద అప్పులు చేశానంటూ బదులిచ్చారు. తనకు ఎవర్నీ మోసం చేయాలనే ఆలోచన లేదంటూ.. పదేపదే బుకాయించే ప్రయత్నం చేసింది.

తెరమీదకు కొత్త పేర్లు

మొదట కాస్త తడబడినా క్రమంగా తాను తీసుకున్న డబ్బును ఆసుపత్రి నిర్మాణానికి ఖర్చు చేశానంటూ శిల్ప తెలిపింది. ఆసుపత్రి నిర్మాణ పెట్టుబడుల కోసం ఇద్దరికి పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చినట్టు విచారణలో కొత్త పేర్లు తెరమీదకు తీసుకువచ్చింది. ఆ డబ్బంతా వారి వద్దనే ఉండి పోయిందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరిలో శంకరంపల్లి ప్రాంతానికి చెందిన రాధికకు 6కోట్ల రూపాయలు ఇచ్చానని... చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై రాధిక అనే మహిళ తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని పోలీసు అధికారులను కలిసి చెప్పినట్టు సమాచారం. అయితే పెద్ద మొత్తంలో ఆసుపత్రి ఏర్పాటు కోసం.. నగదు ఇచ్చానని చెబుతున్న ఆ ఇద్దరు ఎవరు? వారికి శిల్ప వాస్తవంగానే డబ్బు ఇచ్చిందా? లేక తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

మరోసారి కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్న పోలీసులు

ఈమె చేతిలో మోసపోయిన బాధితుల జాబితాలో.. ప్రముఖులు కుటుంబ సభ్యులు ఉండటంతో.. పోలీసులు కేసును సవాల్ గా తీసుకున్నారు. శిల్ప దంపతులపై ఇప్పటి వరకూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏడు కేసులు నమోదయ్యాయి. సుమారు 12కోట్ల వరకూ మోసపోయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిల్ప మాయమాటలతో ప్రభావితమై ఐఏఎస్, ఐపీఎస్, న్యాయాధికారులు... రాజకీయ, సినీవర్గాలకు చెందిన ఎంతోమంది కోట్లాది రూపాయలు ఇచ్చినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ఆమె దండుకున్న నగదు ఎక్కడికి మళ్లించిందనే అంశంపై.. మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉండడంతో మరో సారి కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

సిగ్నేచర్​ విల్లాలో సోదాలు

గండిపేటలోని సిగ్నేచర్ విల్లాస్ లో శిల్ప నివాసంలో పోలీసులు సోదాలు జరిపారు. బ్యాంకు అధికారులతో ఏడాదిగా జరిగిన లావాదేవిల గురించి మాట్లాడారు. నాలుగు బ్యాంకు ఖాతాల్లో రెండింట్లో ఎలాంటి నగదు లేదని గుర్తించిన పోలీసులు మరో రెండు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.

ఇదీ చదవండి:

Shilpa Chowdary Case: కస్టడీలో కీలక విషయాలు.. శిల్పా కేసులో కొత్త క్యారెక్టర్​..!

ABOUT THE AUTHOR

...view details