తెలంగాణ

telangana

ETV Bharat / crime

రక్త సంబంధీకులే.. రాక్షసుల్లా మారితే..!

తండ్రి, అన్న, సోదర సమానుల వంటి వారే వావి వరుసలు మరిచి అభంశుభం ఎరుగని బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడుతుండటం బాధాకరం. అయిన వారే కావడం, పైగా ఏం చేస్తారోనన్న భయంతో అటు బయటపడలేక.. ఇటు నరకాన్ని భరించలేక కుమిలిపోవడం బాధితురాళ్ల వంతు అవుతోంది. వేధింపులు తారస్థాయికి చేరిన సందర్భాల్లో ఘోరాలు బయటకు పొక్కుతున్నాయి. సభ్య సమాజం నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.

sexual harassment, sexual harassment on women, sexual harassment in kothagudem
మహిళలపై అఘాయిత్యం, కొత్తగూడెం జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు

By

Published : Apr 8, 2021, 8:40 AM IST

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో కన్నతండ్రే కూతురి(14)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని వయసులో ఆ బాలిక నరకాన్ని అనుభవిస్తూ వచ్చింది. నిత్యం నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లి గట్టిగా నిలదీయడంతో.. కామాంధుడిగా మారిన కన్నతండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టింది. తనను లైగికంగా ఏ విధంగా వేధిస్తున్నాడో వివరిస్తూ బోరున విలపించింది. కామాంధుడైన భర్తకు దేహశుద్ధి చేసిన భార్య ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
  • దూరపు బంధువు.. చెల్లెలు వరుసయ్యే యువతితో సొంత అన్నయ్యలా నటిస్తూ వచ్చిన ఓ కామాంధుడు ఆమెను లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. చివరకు ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లి ఆరా తీసింది. దీంతో తనపై జరిగిన లైంగిక దాడి గురించి వివరించింది. ఆగ్రహించిన తల్లి ఆ ప్రబుద్ధుణ్ని నిలదీసింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.
  • తనను ‘అన్నయ్యా’ అని ఆప్యాయంగా పిలిచే యువతిపై సోదర సమానుడైన మరో కీచకుడు కన్నేశాడు. ఆమె నగ్న చిత్రాలను రహస్యంగా చిత్రీకరించాడు. వాటిని బయటపెడతానని బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. తను పిలిచినప్పుడల్లా వచ్చి కోరిక తీర్చాలని పదే పదే ఒత్తిడి తెస్తుండటంతో చివరకు భరించలేకపోయింది. సమీప బంధువుకు తనపై జరుగుతున్న దారుణం గురించి మొరపెట్టుకుంది. రక్త సంబంధీకుడు కావడంతో ఆ విషయాన్ని బయటకు పొక్కనివ్వని కుటుంబీకులు యువకుణ్ని మందలించి సమస్య పరిష్కరించారు.

జిల్లాలో ఓ యువతిపై సోదరులే అఘాయిత్యానికి పాల్పడిన వైనం తాజాగా వెలుగుచూసింది. రక్త సంబంధానికి మచ్చ తెచ్చే ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటున్నాయి. తండ్రి, అన్న, సోదర సమానుల వంటి వారే వావి వరుసలు మరిచి అభంశుభం ఎరుగని బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడుతుండటం బాధాకరం. అయిన వారే కావడం, పైగా ఏం చేస్తారోనన్న భయంతో అటు బయటపడలేక.. ఇటు నరకాన్ని భరించలేక కుమిలిపోవడం బాధితురాళ్ల వంతు అవుతోంది. వేధింపులు తారస్థాయికి చేరిన సందర్భాల్లో ఘోరాలు బయటకు పొక్కుతున్నాయి. సభ్య సమాజం నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.

వారి అసహాయతే అలుసుగా..

ఎదిరించి నిలబడలేనన్న నిస్పృహ, బాధ్యత మరిచిపోతున్న కుటుంబ నేపథ్యాలే పలువురు బాధితురాళ్ల నరకానికి కారణమవుతున్నాయి. మరికొన్ని సంఘటనల్లో మాత్రం కుటుంబ పరువు అనేది నోరు నొక్కేలా చేస్తోంది. బాధను భరించలేక, బెదిరింపుల ‘బంధం’ నుంచి తప్పిచుకోలేక పోతున్న వారిలో 12 నుంచి 18 ఏళ్ల లోపు (మైనర్‌) బాలికలే అధికంగా ఉంటున్నారని గత సంఘటనలను విశ్లేషిస్తే తెలుస్తోంది.

బాధ్యతలు మరవొద్ధు.

మైనర్లపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్న ఉదంతాలను బట్టి చూస్తే వారి కుటుంబ నేపథ్యం ప్రధాన కారణంగా నిలుస్తోంది. దుర్భర పేదరికంతో పాటు మద్యం వంటి వ్యసనాలకు గురవుతున్న వారే ఈడొచ్చిన బాలికలపై లైంగికదాడులకు తెగబడుతున్నారని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. పాఠశాల లేదా కళాశాలల నుంచి డ్రాపౌట్‌ అయి ఇళ్లకే పరిమితం అవుతున్నవారు, లేదా పేదరికంతో బడి గడప తొక్కని బాలికలే సహజంగా ఇంటా, బయటా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఓ సర్వే కూడా తేల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యకు నోచని వారు 40 శాతం మంది ఉండటం గమనార్హం. గిరిజన బాలికల్లో చూస్తే పూర్వ ఖమ్మం పరిధిలో 48.4 శాతం మంది నిరక్షరాస్యులే. దీనికి తోడు పెరిగే వాతావరణం, చుట్టూ నెలకొన్న పరిస్థితులు, సామాజిక అసమానతలు, చరవాణుల్లో అశ్లీల వీడియోల వీక్షణ ప్రభావం కూడా ఈ తరహా నేరాలకు పురిగొల్పుతున్నట్లు చెప్పవచ్ఛు విలువలతో కూడిన కుటుంబం, బాలికా విద్య దిశగా ప్రోత్సాహం, లింగ సమానత్వంపై సమాజ చైతన్యమే వీటికి చరమాంకం పలకవచ్చని సామాజిక వేత్తలు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details