తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురు మృతి - gowhati express accident

ఆగిపోయిన రైలు నుంచి దిగిన ప్రయాణికులు.. ఇంకో రైలు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు..
ఆగిపోయిన రైలు నుంచి దిగిన ప్రయాణికులు.. ఇంకో రైలు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు..

By

Published : Apr 11, 2022, 10:26 PM IST

Updated : Apr 12, 2022, 9:58 AM IST

22:23 April 11

శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం, ఐదుగురు మృతి

ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురు మృతి

ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆతృతే వారిని మృత్యుఒడికి చేర్చింది. ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్నామని సంతోషించేలోపే...మరోరూపంలో మృత్యువు కబలించింది. ఆంధ్రప్రదేశ్​ శ్రీకాకుళం జిల్లా బాతువ రైల్వేస్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా....మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం బాతువ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై ఉన్నవారిని కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగంగా ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రైలు బలంగా ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ముక్కలు ముక్కలుగా పడిన శరీర భాగాలతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది.

కోయంబత్తూరు నుంచి సిల్‌చెర్‌ వెళ్తున్న గుహవాటి ఎక్స్‌ప్రెస్ చీపురుపల్లి దాటిన తర్వాత ఓ బోగి నుంచి పొగలు రావడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు చైన్‌లాగి రైలు ఆపేశారు. భయంతో కొందరు కిందకు దిగి పట్టాలపై నిల్చున్నారు. అదే సమయంలో భువనేశ్వర్‌ నుంచి విశాఖకు వేగంగా వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. వీరిలో ఇద్దరు అస్సాంకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని శ్రీకాకుళం తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇతను ఒడిశాలోని బ్రహ్మపురం ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. శ్రీకాకుళం కలెక్టర్‌ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

రూ.2లక్షలు పరిహారం: రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు అన్నివిధాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ నివేదించిన తాజా వివరాలను ముఖ్యమంతి కార్యాలయ కార్యదర్శి సీఎంకు అందించారు. రైలు ఢీకొన్న ఘటనలో 5గురు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరణించిన వారిలో గుర్తింపు కార్డులు ఆధారంగా ఇద్దరు అసోం రాష్ట్రానికి చెందినవారుగా తేల్చారన్నారు. మిగిలిన ముగ్గురిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారు కూడా వేరే రాష్ట్రానికి చెందినవారై ఉంటారని, ఇదే విషయాన్ని అధికారులు తెలిపారని సీఎంకు వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ ఒక వ్యక్తిని అదే రైలులో శ్రీకాకుళం తీసుకు వచ్చారని, వెంటనే అతన్ని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఆర్డీఓ ప్రమాద స్థలాన్ని సందర్శించి అవసరమైన చర్యలు తీసుకున్నారని, గాయపడ్డ వ్యక్తికి అందుతున్న వైద్యాన్ని కలెక్టర్‌ స్వయంగా రిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారని, మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారని, అక్కడ అందుతున్న వైద్యంపైనా కలెక్టర్‌ పర్యవేక్షిస్తున్నారని వివరించారు. మరణించిన వారు పరాయి రాష్ట్రం వారైనా, మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

మెరుగైన వైద్యసేవలు అందించాలి: రైలు ఢీకొని మరణించిన ఘటనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాద మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే బాధితులకు సహకరించాల్సిందిగా స్థానిక పార్టీ నేతలను ఆదేశించారు.

ఇదీ చూడండి:

Last Updated : Apr 12, 2022, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details