Kakinada oil tank incident: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జీ రాగంపేట అంబటి సుబ్బయ్య నూనె పరిశ్రమలో ఏడుగురి కార్మికులు చనిపోవడం అందరినీ కలిచి వేసింది. కార్మికులను 24 అడుగుల లోతైన నూనె ట్యాంకు శుద్ధి చేసేందుకు దించారు. ట్యాంకుకు పైన మూత మాత్రమే తెరిచి ఉండగా.. లోపలకు దిగేందుకు ఇనుప నిచ్చెన అమర్చారు. ఇంత లోతైన ట్యాంకులోకి దిగేందుకు కార్మికులకు ఆక్సిజన్ సిలెండర్, మాస్క్ అమర్చాలి.. లోపలికి దిగిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉందన్నది క్షణక్షణం పరిశీలించాలని నిపుణులు అంటున్నారు. అలాగే ట్యాంకుకు కింది భాగంలో తెరిచేందుకు వాల్ ఏర్పాటు చేయాలని.. కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కార్మికుల్ని లోపలికి దించడం వల్ల మరణాలు సంభవించాయని చెబుతున్నారు.
ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ కార్మికుడు కిరణ్ లోపల ఊపిరాడలేదని తెలిపాడు. నాల్ ఎడిబుల్ నూనె నిల్వ చేసే ట్యాంకు కావడం, నెలల తరబడి శుద్ధి చేయకుండా మూత బిగించి ఉండటంవల్ల ట్యాంకులో విషవాయువులు తయారయ్యే అవకాశం ఉందని అదే 7గురు కార్మికులు ప్రాణాలు వదలడానికి కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మృతదేహాలను చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కొందరు యాజమాన్యంపై దాడికి దిగారు. చనిపోయిన వారిలో పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన 27 ఏళ్ల దుర్గాప్రసాద్ కు 11 నెలల క్రితమే పెళ్లయింది. భార్య సత్య 7 నెలల గర్భిణి. ఇంటర్ చదివిన దుర్గాప్రసాద్ 5 నెలల క్రితమే ఈ పరిశ్రమలో చేరాడు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో భార్య, తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. అలాగే పులిమేరుకు చెందిన కట్టమూరి నాని, లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు 25ఏళ్ల జగదీష్ ఐటీఐ చదివి ఈ పరిశ్రమలో చేరాడు.