తెలంగాణ

telangana

ETV Bharat / crime

Maoist Leader RK Funeral : అడవిలోనే ఆర్కే అంత్యక్రియలు.. ఆయన చివరి లేఖలో ఏముందో తెలుసా? - అడవిలోనే మావోయిస్టు నేత ఆర్కే అంత్యక్రియలు

అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే (63) మృతదేహానికి శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు(Maoist Leader RK Funeral) జరిగాయి. తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పామేడు-కొండపల్లి ప్రాంతంలో ఆర్కేకు(Maoist Leader RK Funeral) అంతిమ వీడ్కోలు పలికారు.

Maoist Leader RK Funeral
Maoist Leader RK Funeral

By

Published : Oct 17, 2021, 7:25 AM IST

అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే (63) మృతదేహానికి శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు(Maoist Leader RK Funeral) జరిగాయి. తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పామేడు-కొండపల్లి ప్రాంతంలో వాటిని నిర్వహించారు. ఆర్కే మృతదేహం ఫొటోల్ని మావోయిస్టులు శనివారం విడుదల చేశారు. మృతదేహంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు.

కార్యక్రమంలో మావోయిస్టులు, గిరిజనులు భారీగా పాల్గొన్నట్టు మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు అభయ్‌ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆర్కే అంత్యక్రియలకు పోలీసుల నుంచి ఎలాంటి ముప్పు లేకుండా, అటవీ ప్రాంతాల చుట్టూ మావోయిస్టు శ్రేణులు తుపాకులతో పహరా కాశాయి. మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడిగా, ఏఓబీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆర్కే కిడ్నీ సమస్యలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఛత్తీస్‌గఢ్‌లో మరణించారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట.

అధిగమించాల్సిన అడ్డంకులెన్నో: ఆర్కే చివరి లేఖ

ఉద్యమం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారానే విజయాలు సాధించడం సాధ్యమని మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ ఇన్‌ఛార్జి అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ(Maoist Leader RK Funeral) తన చివరి లేఖలో స్పష్టం చేశారు. 38 ఏళ్లపాటు వివిధ హోదాల్లో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన తీవ్ర అనారోగ్యంతో చికిత్స తీసుకుంటూ కూడా క్యాడర్‌ను చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నించారు. డిసెంబరు 2 నుంచి పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) ద్విశతాబ్ది వార్షికోత్సవాలు జరుపుకొంటున్న సందర్భంగా ఆయన సాకేత్‌ పేరుతో రాసిన చివరి లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉద్యమ ఆశయం, ప్రస్తుత గడ్డు పరిస్థితులు, చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి లేఖలో పేర్కొన్నారు. ‘‘20 ఏళ్లుగా భారత్‌, దాని పోలీసు, పారామిలటరీ దళాలతో పీఎల్జీఏ పోరాడుతూ, అనేక విజయాలు సాధించింది, ఆధునిక ఆయుధాలు సమకూర్చుకుంది. అణచివేతలను ఎదుర్కొంటూ, పురోగమిస్తోంది. ప్రజల పక్షపాతిగా పీఎల్‌జీఏ నిరూపించుకుంది. పీడితవర్గాలైన దళిత, బహుజన, మహిళా, ఆదివాసీలలో వ్యవసాయకూలీ, పేద రైతాంగం దీనికి వెన్నెముకగా నిలిచాయి. ఇప్పటికీ అధిగమించాల్సిన అడ్డంకులెన్నో ఉన్నాయి., చైతన్య కార్యక్రమాల ద్వారానే ఇది సాధ్యం. పొరపాట్లను తగ్గించుకుంటూ ఎక్కువ విజయాలు సాధించాలి’’ అని పేర్కొన్నారు.

ఉద్యమానికి ఎదురు దెబ్బలు

అగ్రనేతల మరణాలతో మావోయిస్టు ఉద్యమానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అనారోగ్యంతో కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే తాజాగా చనిపోయిన సంగతి తెలిసిందే. మావోయిస్టు ఉద్యమం ఎదగడానికి బలమైన పునాదులు వేసిన వాళ్లలో ఈయన ఒకరు. 2019 డిసెంబరులో కేంద్ర కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్‌ అలియాస్‌ రామన్న గుండెపోటుతో చనిపోగా ఈ ఏడాది జూన్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ కరోనా సమస్యలతో మరణించారు. ఆయన కూడా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. నాలుగు నెలల వ్యవధిలో ఇద్దరు అగ్రనేతలు మరణించారు. పోలీసుల నుంచి అగ్రనేతలను రక్షించేందుకు సురక్షిత ప్రాంతమైన అబూజ్‌మడ్‌కు తరలించినా, వారిని అనారోగ్యం దెబ్బతీస్తోంది. ఇప్పటికీ కేంద్ర కమిటీలో ఉన్న పలువురు వృద్ధాప్యంతో సతమతమవుతున్నారు. మావోయిస్టు ఉద్యమం దేశవ్యాప్తంగా బలహీనపడింది. కొత్త క్యాడర్‌కు ఉద్యమ నిర్మాణంపై అవగాహన లేదు.అనారోగ్యంతో మరణించిన రామన్న, హరిభూషణ్‌లకు దాడుల వ్యూహకర్తలుగా పేరుంది. ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడు కేంద్ర కమిటీలో 30మంది వరకూ సభ్యులుండేవారు. నేడు 20కి మించడం లేదు. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు వయసు 68 కాగా మిగతా సభ్యుల సగటు వయసు 60కి పైమాటే.

ABOUT THE AUTHOR

...view details