ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట డిపో సెంటర్‌లోని తన మెకానిక్ షెడ్డులో బుధవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు (suicide) పాల్పడిన ఆళ్ల వెంకటేశ్వరరావు అనే బైక్ మెకానిక్ తన అంతకుముందు స్నేహితులతో పంచుకున్న సెల్ఫీ వీడియో చూసిన వారికి కంట తడి పెట్టించింది. అమ్మతో మాట్లాడుతున్నట్లుగా స్వీయ చిత్రీకరణ చేసుకున్న ఆ వీడియోలో వైవాహిక జీవితంలోని కుటుంబ కలహాలను ప్రస్తావించారు.
Selfie Suicide: 'మీ అందరినీ వదిలిపెట్టి పోవాలని లేదమ్మా!' - కృష్ణా జిల్లా వార్తలు
'మీ అందరినీ వదిలిపెట్టి పోవాలని లేదమ్మా?.. నాకింకా బతకాలని ఉంది. కానీ చనిపోక తప్పడం లేదమ్మా. నీకు, నాన్నకు, తమ్ముడు, చెల్లికి ఏమీ ఇవ్వలేక పోతున్నామ్మా' అని సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ వ్యక్తి ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటన.. చూసిన వారిని కంటతడి పెట్టిస్తోంది. ఆర్థికంగా మోసపోయి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనకు సంబంధించి అతని భార్య కుటుంబసభ్యులపై కేసు నమోదైంది.
‘అమ్మా నాకప్పుడే చనిపోవాలని, మీ అందరినీ విడిచిపెట్టి పోవాలని లేదమ్మా! నాకప్పుడే ఏం వయసు అయిపోయిందమ్మా! కానీ చనిపోక తప్పడం లేదమ్మా! అంటూ అతను రోదించిన తీరు గుండెలను పిండేసింది. తనకి ఇంకా బతకాలని ఉందని, కానీ ఆర్థికంగా మోసపోయిన తాను తల్లిదండ్రులకు, తమ్ముడు, చెల్లెలికి ఏమీ ఇవ్వలేకపోతున్నానని కన్నీరు మున్నీరౌతూ చెప్పిన తీరు చూపరుల హృదయాలను కదిలించింది. వీడియోలో తన చేతిపై ఉన్న పచ్చబొట్టును చూపుతూ తనకు కుటుంబంపై ఉన్న ప్రేమను గురించి వివరించారు.
తనకు మంట అంటే భయమని, చనిపోయిన తర్వాత తనని దహనం చేయవద్దని, దయచేసి గుంటలో పెట్టి పూడ్చి ఖననం చేయాలని కోరుకున్నాడు. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం బలుసుపాడు రోడ్డులోని పొలంలో మృతుడి చివరి కోరిక మేరకు ఖననం చేశారు. సెల్ఫీవీడియో ఆధారంగా జరిపిన విచారణలో పోలీసులు నాగరాజుది ప్రేరేపిత ఆత్మహత్యగా పేర్కొన్నారు. భార్య కృష్ణవేణి సహా ఆమె తల్లి, చెల్లెలు, మేనత్త, మధ్యవర్తులపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటరామారావు తెలిపారు.