Seizure of Gold In Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం ఏదో రకంగా వస్తువులు, బంగారంను స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. అధికారుల తనిఖీలకు దొరకకుండా వారు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు అధికారులు. తాజాగా మరోసారి విదేశాల నుంచి తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
షార్జా నుంచి వచ్చిన ఓ వ్యక్తిపై అనుమానంతో అధికారులు అతని బ్యాగును తనిఖీ చేయగా ఈ గుట్టు బయటపడింది. అందులో ఎలక్ట్రిక్ పరికరంలో అక్రమంగా తరలిస్తున్న 435.7 గ్రాముల బంగారాన్ని కనుగొన్నారు. దాని విలువ రూ. 23,14,200 ఉంటుందని వెల్లడించారు. బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై 110 సెక్షన్ కస్టమ్స్ యాక్టు 1962 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.