ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని నల్ల చెరువులో.. కొంగర గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు ఒక్కసారిగా చెరువులో బోల్తా పడటంతో ఓ విద్యార్థి బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులను స్థానికులు చెరువులో నుంచి ఒక్కొక్కరిని బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
School bus accident: చెరువులో పాఠశాల బస్సు బోల్తా.. విద్యార్థి మృతి - A student died in bus accident
విద్యార్థులంతా ఉత్సాహంగా బడికి బయలుదేరారు. నిన్న జరిగిన పాఠాలను నెమరువేసుకుంటూ.. ఈ రోజు నేర్చుకునే వాటి గురించి ఆలోచిస్తూ.. స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉత్సాహంగా స్కూల్ బస్సు ప్రయాణం సాగుతోంది. ఇంతలోనే అనుకోని ప్రమాదం ఎదురైంది. బస్సుకు ఏదైనా అడ్డం వచ్చిందో లేక దానంతట అదే జరిగిందో తెలియదు కానీ అకస్మాత్తుగా బస్సు చెరువులోకి బోల్తా కొట్టింది. ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థి బడివానిపేటకు చెందిన మైలపల్లి రాజు(8)గా స్థానికులు గుర్తించారు. చెరువులో బోల్తా పడిన బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు.
ఇదీ చదవండి :Excise Department Telangana: 'ఎక్సైజ్' ఎస్సైలకు దర్యాప్తు అధికారమే లేదు.. కార్యాచరణ ఎలా సాధ్యం?