Job Fraud In Vijayawada: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలే కాక.. విదేశాల్లోని విమానాశ్రయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో ముందుగానే కొంత మొత్తం వసూలు చేశారు. విదేశాల్లో కార్గో సూపర్‌వైజర్ పోస్టుల కోసమని.. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.50 వేలు కట్టించుకున్నారు. మరో పదివేలు కడితే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తామే ఇస్తామని నమ్మించారు. ఆ విధంగా ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.75వేలు వసూలు చేశారు.
అమెరికా, దుబాయ్, ఇంగ్లండ్, మలేషియాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో చాలా మంది నమ్మి డబ్బులు కట్టేశారు. కొంత మందికి ఎఫ్‌సీఐ, బీఎస్‌ఎన్‌ఎల్ లాంటి కేంద్ర సంస్థల్లోనూ ఉద్యోగాలిప్పిస్తామని లక్షల్లో వసూలు చేశారు. ఉద్యోగాలు రాక, కట్టిన డబ్బులు తిరిగి రాక.. కొంత మంది నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. వినుకొండకు చెందిన ఓ యువతి డిగ్రీ చదివారు. విమానాశ్రయాల్లో కార్గొ సూపర్‌వైజర్ అంటూ ఓ యాప్‌లో ప్రకటన చూసి డబ్బులు కట్టారు. మోసపోయానని గ్రహించాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మరో యువకుడు కూడా ఇదే రీతిలో మోసపోయాడు. ఇలా పదుల సంఖ్యలో బాధితులు విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసపోయారు. డయల్ ఇన్‌స్టిట్యూషన్ పేరుతో 2021 నుంచి జరుగుతున్న ఈ మోసం బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో బట్టబయలైంది. కొంత మంది నిరుద్యోగులు గతేడాదే డబ్బులు కట్టగా.. కొవిడ్ రెండోదశ కారణంగా ఉద్యోగాలు ఆగాయని నిర్వాహకులు నమ్మించారు.