తెలంగాణ

telangana

ETV Bharat / crime

corona medicine scam : హైదరాబాద్​లో కేసు... అమెరికాలో దర్యాప్తు.. ఆ 11.80కోట్లు ఏమైనట్టు..!

corona medicine oil scam : కొవిడ్​ మహమ్మారి వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఎందరో బతుకులు రోడ్డున పడ్డాయి. రెండేళ్ల కాలంలో పరిస్థితులు తల్లకిందులైపోయాయి. అయితే ఈ విపత్కాలంలో ఎవరైనా బాగుపడ్డారంటే వాళ్లు మోసగాళ్లు మాత్రమే. టీకాల పేరుతో కొందరు, మందుల పేరుతో ఇంకొందరు ఇలా రకరకాల పేర్లతో కోట్లు కొల్లగొట్టారు. ఏకంగా ఓ వైద్య విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న వ్యక్తినే బురిడీ కొట్టించి.. సుమారు 11.80కోట్లు కాజేశారు కేటుగాళ్లు.. హైదరాబాద్​లో నమోదైన ఈ కేసు అమెరికాకు చేరింది.. ఇంతకీ ఆమోసం ఎలా జరిగిందంటే...

fbi
fbi

By

Published : Dec 16, 2021, 10:55 PM IST

corona medicine oil scam : హైదరాబాద్‌లో జరిగిన సైబర్‌ నేరంపై అమెరికా పోలీసులు (ఎఫ్‌బీఐ) దర్యాప్తు చేస్తున్నారు.. కరోనా టీకా నూనెతో వ్యాపారం చేద్దామంటూ నైజీరీయన్లు తనవద్ద రూ.11.80కోట్లు స్వాహా చేశారంటూ ప్రవాసభారతీయ వైద్యనిపుణుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ హైదరాబాద్‌లో నాలుగునెలల క్రితం ఫిర్యాదు చేశారు. సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే అమెరికాకు వెళ్లిన డాక్టర్‌ చంద్రశేఖర్‌.. సెయింట్‌ లూసియానాలోని పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.

నైజీరియన్లు నగదు కొల్లగొట్టిన బ్యాంక్‌ ఖాతాలు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాకు చెందినవి కావడంతో ఎఫ్‌బీఐ పోలీసులు వేగంగా స్పందించారు. కొద్దిరోజుల్లోనే దుబాయ్, అమెరికాలోని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా శాఖల నుంచి వేర్వేరు ఖాతాలకు వెళ్లిన రూ.1.80కోట్లను ఫ్రీజ్‌ చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నైజీరియన్లు ఉపయోగించిన మెయిల్స్‌ ఆధారంగా ఐపీ చిరునామాలను గుర్తించారు. ఇలా రెండు దేశాల్లో నమోదైన సైబర్‌ నేరంపై పోలీస్‌ అధికారులు సమాంతరంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ జరిగింది...

అమెరికాలోని సెయింట్‌ లూసియానాలో డాక్టర్‌ చంద్రశేఖర్‌ కుటుంబం వైద్య విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండడంతో డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఏటా ఇక్కడి వస్తున్నారు. ఫేస్‌బుక్‌ ద్వారా ముగ్గురు నైజీరియన్లు డాక్టర్‌ చంద్రశేఖర్‌ను ఈ ఏడాది మార్చిలో పరిచయం చేసుకున్నారు. గీతానారాయణ్‌ పేరుతో పరిశోధక విద్యార్థినంటూ చెప్పుకొన్న నైజీరియన్‌.. జంతువులకు వేసే కరోనా టీకాలకు అవసరమైన ముడి నూనె భారత్‌లో ఉందని, దాన్ని కొనేందుకు లండన్‌లో ప్రముఖ ఫార్మా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయంటూ చెప్పింది. ఆయనతో మాట్లాడుతూ లండన్‌లోని కంపెనీల పేర్లు ఉటంకిస్తూ ఉత్తుత్తి నూనె, టీకాల పేరుతో డాక్టర్‌ చంద్రశేఖర్‌ నుంచి నాలుగు నెలల క్రితం దశలవారీగా రూ.11.80కోట్లు కొట్టేశారు. ఇందుకోసం వారు టీకా నూనెకు కొనే ఫార్మా కంపెనీ నార్మాంజ్‌ పారామెడికల్‌ లిమిటెడ్‌ కంపెనీ కొనుగోలు విభాగం అధికారిగా బెంజిమెన్‌ అనే రెండో నైజీరియన్, మహరాష్ట్రలోని రాయగఢ్‌లో నూనెను తయారు చేసే లక్ష్మిగా మూడో నైజీరియన్‌లు వ్యవహరించారు.

ఇత్తడి నూనె సీసాలు.. లండన్‌రేవుకు ఎగుమతి

కరోనా టీకాకు అవసరమైన నూనె ఉందనే నైజీరియన్లు డాక్టర్‌ చంద్రశేఖర్‌ను నమ్మించారు. రాయగఢ్‌ నుంచి టీకా నూనెను ఇత్తడి సీసాల్లో నింపి అమెరికాలోని ఓడరేవుకు పంపించాలని, అక్కడి నుంచి తాము లివర్‌పూల్‌లోని ఫార్మాకంపెనీకి తెప్పించుకుంటామని వ్యాట్‌ సుంకం తగ్గించుకునేందుకు ఇదంతా చేస్తున్నామని బెంజిమెన్‌ ఆయనకు వివరించాడు. నూనె సీసాల ఎగుమతి, పోర్టు వ్యవహారాలు మాట్లాడారు. సరిగ్గా అప్పుడే డాక్టర్‌ చంద్రశేఖర్‌ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ విషయాన్ని ఆయనకు నైజీరియన్ుల వివరించగా.. రాయగఢ్‌లో లక్ష్మీకుమార్‌ కంపెనీ తయారు చేసిన నూనెను నేరుగా అమెరికాకు పంపుతుందని, కేవలం నగదు బదిలీ చేస్తే చాలని డాక్టర్‌ను ఒప్పించారు. నూనె నింపుతున్నట్టు ఆయన నమ్మేందుకు ఇత్తడి సీసాల వీడియోలు పంపించారు. రెండునెలల్లో రూ.11.80కోట్లు బదిలీ చేసుకున్నారు. నూనెను అమెరికాకు కాకుండా లండన్‌కు పంపించామన్నారు. వ్యాట్‌ కింద మరో 2.5లక్షల డాలర్లు చెల్లించాలంటూ బెంజిమెన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ను ఒత్తిడి చేశాడు. అప్పుడు వీరిపై డాక్టర్‌కు అనుమానం వచ్చింది. లండన్‌లో ఉన్న తన స్నేహితుల ద్వారా ఓడరేవు అధికారులను విచారించగా.. ఎలాంటి టీకా నూనె సీసాలు లేవంటూ చెప్పారు.

దుబాయ్‌ నుంచి ఆపరేషన్‌...!

ప్రవాస భారతీయ వైద్యనిపుణుడు చంద్రశేఖర్‌ను మోసం చేసిన నైజీరియన్లు దుబాయ్‌లో ఉన్నారా? లేదా కొద్దిరోజులు దుబాయ్‌కి వెళ్లి సైబర్‌ నేరం చేశారా? అన్న కోణాల్లో సైబర్‌క్రైమ్‌ పోలీసులు పరిశోధిస్తున్నారు. డాక్టర్‌ చంద్రశేఖర్‌కు పంపించిన మెయిల్స్‌ను పరిశీలించగా... ఐదు ఐపీ చిరునామాలు దుబాయ్‌కు చెందినవని తేలింది. వీటి ద్వారా నైజీరియన్లు ఎక్కడి నుంచి మెయిల్స్‌ చేశారన్నది తెలుస్తుందని పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు. డాక్టర్‌ చంద్రశేఖర్‌ నుంచి నగదు బదిలీ చేసుకున్న రూ.11.80కోట్లు(అమెరికన్‌డాలర్ల రూపంలో) నిందితులు విదేశీబ్యాంకుల్లోకి బదిలీ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ మోసానికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా ఎఫ్‌బీఐ అధికారులకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి:Drugs Seized at ORR: డ్రగ్స్‌ పంచుకుంటుండగా.. పోలీసుల ఎంట్రీ.. ముగ్గురు అరెస్ట్‌

ABOUT THE AUTHOR

...view details