దుందుభీ వాగు, పెద్ద వాగు, ఊక చెట్టువాగు... వాగు ఏదైతేనేం... ఇసుక రాశులుంటే చాలు... పదుల కొద్ది ట్రాక్టర్లు, టిప్పర్లు గద్దల్లా వాలిపోతాయి. చూస్తుండగానే వాహనాల్ని నింపి ఇసుకను తరలించుకుపోతాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుకు ఇవే సాక్ష్యాలు.
అక్రమ రవాణా అని తెలిసినా..
మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలో బాలానగర్, జడ్చర్ల, మిడ్జిల్, తిమ్మాజీపేట, కల్వకుర్తి, వంగూరు, తెలకపల్లి ఉప్పునూతలలో దుందుభీ వాగు సుమారు 65 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఇసుక రాశులున్న ప్రతిచోటా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ అవసరాల కోసమని 10 ట్రాక్టర్లకు అనుమతులు తెచ్చుకుని వందల ట్రాక్టర్లు తరలిస్తున్నారు. జరిగేది అక్రమ రవాణా అని తెలిసినా చర్యలు తీసుకోకపోవడం వల్ల.. ఫిర్యాదు చేసేందుకు సైతం జనం ముందుకు రావడం లేదు.
నారాయణపేట జిల్లాలో..
నారాయణపేట జిల్లాలో పెద్దవాగు వెంట ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఊట్కూరు మండలం మల్లెపల్లి, నాగిరెడ్డిపల్లి, పగిడిమర్రి, వల్లంపల్లి, మక్తల్, మాగనూరు, పసుపుల, చిట్యాలలో అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. రాత్రివేళ వాగుల్లోకి ట్రాక్టర్లు వెళ్లడం, ఇసుక నింపి ఏదో చోట డంప్ చేయడం, తెల్లారేసరికి టిప్పర్లతో అక్కడ నుంచి గద్వాల, ఆత్మకూరు, అమరచింత, హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాగుల్లో మనిషిలోతు ఇసుక తవ్విన ఆనవాళ్లని చూస్తే అక్రమ రవాణా ఎలా సాగుతుందో తెలుసుకోవచ్చు. నారాయణపేట జిల్లాలో ఏడాదికాలంగా నిత్యం టాస్క్ ఫోర్స్ అధికారులు ఇసుక లారీలను పట్టుకుంటున్నా, అక్రమదందాకు అడ్డుకట్ట పడటం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.